సాక్షి, హైదరాబాద్: పుప్పాలగూడ చెరువులో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, పుప్పాలగూడలోని శంకర్‌నగర్ సమీపంలో అయిదారేళ్లుగా మూసీ నదిని పూడ్చివేయడాన్ని వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ లుబ్నా సార్వవత్ రాసిన లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రెండు చోట్లా ఆక్రమణలను అడ్డుకోవాలని, ఇప్పటికే ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాలని, నిర్మాణాలు జరుగుతూ ఉంటే వెంటనే వాటిని నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా న్యాయవాది కె.పవన్‌కుమార్‌ను హైకోర్టు నియమించింది.
చెరువును హోండా అండ్ హేరేజస్ పూడ్చేయడంతో హెచ్‌ఎండీఏ రికార్డులో లేకుండా పోయిందని, చెరువును తిరిగి తవ్వేలా సరస్సుల పరిరక్షణ కమిటీకి, వాల్టా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని సార్వవత్ లేఖలో కోరారు. శంకర్‌నగర్‌లో మూసీని ఆరేళ్లుగా పూడ్చివేసి ఆక్రమణలకు పాల్పడుతున్నా అధికారులు పట్టిం చుకోవడం లేదని, ఆక్రమణల తొలగింపునకు మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఉత్తర్వులివ్వాలని కూడా కోరారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ కోరడంతో విచారణ జూన్ 24కి వాయిదా పడింది. కాగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం లోని కట్టమైసమ్మ చెరువు ఆక్రమణల నివారణకు తీసుకున్న చర్యలను తెలపాలని హెచ్‌ఎం డీఏ, జీహెచ్‌ఎంసీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. చెరువు నీటి పరీవాహక ప్రాం తంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని ఎస్.మల్లేశ్వరరావు దాఖలు చేసిన పిల్ పై విచారణ జూన్ 24కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment