సాక్షి, హైదరాబాద్: ఎడారి ప్రాంతం కాని తెలంగాణలోకి 71 ఒంటెలు ఎలా వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒంటెల తరలింపును అడ్డుకోవడంతోపాటు ప్రస్తుతం ఉన్న ఒంటెల సంరక్షణకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలపాలని సర్కారును ఆదేశించింది. ఒంటె మాంసం విక్రేతలపై చర్యలు చేపట్టాలని, ఒంటెలను వధించకుండా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ కె.శశికళ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. రాజస్తాన్ నుంచి ఒంటెలను తరలించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. అక్రమంగా ఇక్కడికి తరలించిన ఒంటెలను సైతం తిరిగి రాజస్తాన్‌కు తరలించామని తెలిపారు. ఒంటెల తరలింపును అడ్డుకునేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
కఠిన చర్యలు తీసుకుంటున్నాం..
రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయించే వారిపై జీహెచ్‌ఎంసీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు ఒంటె మాంసం విక్రేతలపై, వాటి మాంసాన్ని అమ్మకుండా తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రంజాన్ మాసంలో ఒక వర్గం ప్రజలు ఒంటె మాంసాన్ని భుజించడం ఆచారంగా వస్తోందని వెటర్నరీ విభాగం డైరెక్టర్ లక్ష్మారెడ్డి హైకోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment