సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే స్వల్ప అస్వస్థతతో ఉండటంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా మహమూద్ అలీని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోలుకొని ఇంటికి వెళ్లారు. అందరి ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో పనిచేసే 20 మందికి వైరస్ సోకింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విస్తృతంగా శానిటైజేషన్ పనులు ముమ్మరం చేశారు. అయితే ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 20,903 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,25,439కి చేరింది. (20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి )
Comments
Please login to add a commentAdd a comment