పండగొచ్చె.. పతంగులకు..!
పండగొచ్చె.. పతంగులకు..!
Published Fri, Dec 2 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
రాష్ట్రంలో అంతర్జాతీయ వేడుకగా నిర్వహణ
జనవరి 12 నుంచి వారం రోజులపాటు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండగను అహ్మదాబాద్‌కు దీటుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 12 నుంచి వారం పాటు వేడుకలు జరగనున్నాయి. 16 దేశాలకు చెందిన అంతర్జాతీయ పతంగుల నిపుణులు ఇందులో పాల్గొనబోతున్నారు. వీరుగాక మరో 32 దేశాలకు, దేశంలోని 15 కైట్ క్లబ్‌లకు అధికారులు ఆహ్వానాలు పంపారు. తొలుత 12వ తేదీ రాత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నైట్ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. 14, 15 తేదీల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోని ఆగాఖాన్ అకాడమీ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించనున్నారు. 16, 17 తేదీల్లో వరంగల్‌లో ఉత్సవాలు జరుపుతారు. హైదరాబాద్‌లోని 15 పెద్ద పాఠశాలలను కూడా వేడుకల కోసం గుర్తించారు. ఒక్కో పాఠశాలలో వేరుు మంది చొప్పున విద్యార్థులు పాల్గొననున్నారు. పతంగుల వేడుకను బాలిక విద్య ఇతివృత్తంగా నిర్వహించనున్నారు. సందర్శకులు కొనే టికెట్ల రూపంలో వచ్చే మొత్తాన్ని ఇద్దరు పేద బాలికలు నిజామాబాద్‌కు చెందిన రాధ, హైదరాబాద్‌కు చెందిన నిఖితలకు స్కాలర్‌షిప్స్‌గా ఇవ్వనున్నారు.
తెలంగాణకు కొత్త కీర్తి
అంతర్జాతీయ పతంగుల ఉత్సవం ద్వారా తెలంగాణకు మంచి ఖ్యాతి రానుంది. ఈ ఏడాది 16 దేశాలకు చెందిన నిపుణులు వస్తుండటం దీనికి బలం చేకూరుస్తుంది. వచ్చే ఏడాది నుంచి పర్యాటకులు పోటెత్తుతారు.
- మంత్రి చందూలాల్
2020కి లక్ష మంది..
గతేడాది తమ క్లబ్ సభ్యులను పంపేందుకు అహ్మదాబాద్ వెనకాడింది. ఈసారి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిద్దామని కోరింది. 2020లో లక్ష మంది పర్యాటకులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
- బుర్రా వెంకటేశం,
పర్యాటక శాఖ కార్యదర్శి
Advertisement