ఏపీ సహకరించేలా చూడండి
♦ ఆర్డీఎస్‌పై కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ
♦ ఏపీ అధికారులు కర్ణాటకకు రాసిన లేఖను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్) ఆధునీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేందుకు.. ఏపీ ప్రభుత్వం సహకరించేలా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం బోర్డు సభ్య కార్యదర్శికి రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్‌డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా కర్నూలు ప్రాంత రైతులకు నష్టం వాటిల్లదని లేఖలో పేర్కొన్నారు.
ఆర్డీఎస్ పూర్వాపరాలను లేఖలో వివరించారు. ఈ ఆనకట్ట పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్‌డీఎస్ ఆనకట్ట ఎత్తును అడుగు మేర పెంచడంతో పాటు కుడివైపు ఉన్న తూము, కాలువల స్థితిగతులను మెరుగుపరచాలని నిపుణుల కమిటీ సూచించిందని వివరించారు. ఈ నివేదిక ఆధారంగానే ఆర్‌డీఎస్ ఆధునీకరణకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని, తన వంతు వాటాగా రూ.58.93 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిం దన్నారు. ఆనకట్ట ఎత్తు పెంచడం, హెడ్‌వర్క్స్ మరమ్మతులను చేపట్టిన సంస్థ 20% పనులనే పూర్తి చేసిందన్నారు. కర్నూలు జిల్లా రైతులు తరచూ పనులను అడ్డుకోవడంతో ఆధునీకరణ ముందుకు సాగక, ఆర్‌డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల వాటా అందడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఏపీ అభ్యంతరాలకు ఆధారాలివిగో..: ఆర్‌డీఎస్ ఆధునీకరణ పనులు నిలిపివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి తాము ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రభుత్వం అసత్యాలుగా అభివర్ణించింది. ఆర్‌డీఎస్ పనులు ఆపాలంటూ ఈ నెల 16న కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవో ఓబులేశు, ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు రాసిన లేఖలను విడుదల చేసింది. ‘‘ఆర్‌డీఎస్ సైట్ వద్ద కర్ణాటక అధికారులు పనులు జరిపిస్తున్నారు. కర్నూలు జిల్లా రైతులు, ప్రజలు ఈ పనులను వ్యతిరేకిస్తున్నారు.
ఏపీ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తుతుందని భావిస్తున్నాం. ఈ ఆందోళన ఆర్‌డీఎస్ వద్ద శాంతిభద్రతల సమస్యగా పరిణమించే అవకాశం ఉంది’’ అని ఇరువురు అధికారులు కర్ణాటకలోని రాయచూర్ (సింథనూరు) ఆర్‌డీఎస్ ఎస్‌ఈ శ్రీప్రకాశ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు సింథనూరు ఎస్‌ఈ, కర్నూలు కలెక్టర్ నడుమ ఈ నెల 16న సాగిన ఎస్‌ఎంఎస్ సంభాషణ కూడా బహిర్గతమైంది. ‘‘కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో.. ఈ రోజు నుంచి ఆర్‌డీఎస్ పనులు ప్రారంభమయ్యాయి.
మా డిప్యూటీ కలెక్టర్ మీతో మాట్లాడతారు..’ అని కర్నూలు కలెక్టర్‌కు సింథనూరు ఎస్‌ఈ మెసేజ్ ఇచ్చారు. ‘‘ఏపీ ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఎలాంటి పనులు ప్రారంభించవద్దు. ప్రారంభమైన పనులను వెంటనే నిలిపేయండి’’ అని కర్నూలు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. దీనికి బదులుగా ‘‘మీ వైపు నుంచి అనుమతి లభించిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం’’ అని సింథనూరు ఎస్‌ఈ సందేశం పంపారు.