తెలంగాణ కోసమే ఆ బలిదానం
శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అలీ
హైదరాబాద్: తెలంగాణ కోసమే శ్రీకాంతాచారి బలయ్యాడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు. శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా ఎల్‌బీ నగర్ రింగురోడ్డులో అతని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ మహాత్ముడు కేసీఆర్ అని, ఆయన చేపట్టిన ఉద్యమం అనిర్వచనీయమని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ఎల్‌బీనగర్‌లో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహశిల్పి మాయాచారిని మంత్రులు సన్మానించారు.