కొలువుదీరిన అసెంబ్లీ | Telangana MLAs Oath In Assembly | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన అసెంబ్లీ

Published Fri, Jan 18 2019 1:06 AM | Last Updated on Fri, Jan 18 2019 4:38 AM

Telangana MLAs Oath In Assembly - Sakshi

గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సభలో సీఎం కేసీఆర్‌ సహా 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయగా, ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కొందరు ఎమ్మెల్యేలుగా తాము రాజ్యాంగబద్ధులమై ఉంటామని, మరికొందరు సభా నియమాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. 15 మంది ఎమ్మెల్యేలు పవిత్ర హృదయంతో.. మిగిలినవారు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆరుగురు సభ్యులు మాత్రమే ఇంగ్లిష్‌లో, మిగిలిన వారు తెలుగులో ప్రమాణ స్వీకార పత్రం చదివారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం.. ఎమ్మెల్యేగా గెలిచినట్లుగా రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని శాసనసభ అధికారులకు అందజేసి ప్రమాణం చేశారు. ఆ తరువాత రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. ప్రమాణం సమయంలో కొందరు ఎమ్మెల్యేలు సభా నియమాలకు కట్టుబడి ఉంటామని పలకడానికి బదులుగా సభ నియామకాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ప్రమాణ పత్రం చదవడంలో తడబడ్డారు. ముందుగానే వచ్చిన కేసీఆర్‌: ఉదయం 11:30 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా.. టీఆర్‌ఎస్, మజ్లిస్‌ ఎమ్మెల్యేలు ఉదయం 11:15 గంటలకే సభలోకి వచ్చారు. తర్వాత 10 నిమిషాలకు  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎం కేసీఆర్‌ 11:26కు సభ లోపలికి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు గౌరవంగా స్వాగతం పలికారు. జాతీయగీతం జనగణమనతో సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార క్రమాన్ని ప్రొటెం స్పీకర్‌ వెల్లడించారు. ముందుగా సీఎం, తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం వరుస క్రమంలో ఉంటుందని వెల్లడించారు. ఆ ప్రకారమే సీఎం కేసీఆర్‌ 11:34 గంటలకు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలియజేసి, రిజిస్టర్‌లో సంతకం చేశారు.

ఈసారి మహిళా సభ్యులకు అవకాశం
సాధారణంగా సీఎం తర్వాత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రమాణం చేస్తారు. అయితే ఈసారి హోం మంత్రి (ఆయన కూడా ఎమ్మెల్సీ) మినహా ఇతర శాఖలకు మంత్రులు లేకపోవడంతో సీఎం తర్వాత మహిళ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మిగిలినవారు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం తర్వాత వరుసగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, అనసూయ ధనసరి (సీతక్క), గొంగిడి సునీత, బానోత్‌ హరిప్రియ, పద్మాదేవెందర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రమాణం చేశారు. మిగతా ఎమ్మెల్యేల ప్రమాణం అలంపూర్‌ ఎమ్మెల్యే వీఎం అబ్రహంతో మొదలై మధాహ్నం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో (1:39 గంటలకు) ముగిసింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ సహా 119 మంది (ప్రొటెం స్పీకర్‌ మినహా)లో 114 మంది ప్రమాణం చేశారు.

ఒక్కో కారణంతో దూరం
ఐదుగురు ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. మజ్లిస్‌ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, జాఫర్‌ హుస్సేన్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సభకు హాజరు కాలేదు. వారంతా సభకు గైర్హాజరైనట్లు సభ చివరలో ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. మజ్లిస్‌ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉండగా తాను ప్రమాణ స్వీకారం చేయబోనని ముందుగానే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి స్పీకర్‌ వచ్చాక ఆయన ప్రమాణం చేసే అవకాశం ఉంది. కాగా, మజ్లిస్‌ పక్షనేత అక్బరుద్దీన్‌ వైద్య పరీక్షల కోసం లండన్‌ వెళ్లడంతో, ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌.. మక్కా యాత్రకు వెళ్లడంతో సభకు రాలేకపోయారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అత్యవసరపనిపై బయటకు వెళ్లడంతో గైర్హాజరయ్యారు. ఆయన శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నియోజకవర్గంలోనే ఉండిపోయారు. ఆయన శనివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.

వీల్‌ చైర్‌లో సభకు సాయన్న
కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యం కారణంగా వీల్‌ చైర్‌లో సభకు హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా గురువారమే ప్రమాణం చేశారు. అనంతరం అటెండర్ల సహకారంతో ప్రొటెం స్పీకర్‌ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు రెండు గంటలకుపైగా కొనసాగింది. అనంతరం ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ ఖాన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం ఉదంయ 11 గంటలకు తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు.

పవిత్ర హృదయంతో..
ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన వారిలో అత్యధికంగా దైవసాక్షిగా ప్రమాణం చేయగా, 15 మంది ఎమ్మెల్యేలు మాత్రం పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. వారిలో అనసూయ ధనసరి (సీతక్క), అంజయ్య, రసమయి బాలకిషన్, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, గురుక జైపాల్‌ యాదవ్, కాలె యాదయ్య, కేటీఆర్, కందాల ఉపేందర్‌రెడ్డి, క్రాంతి కిరణ్‌ చంటి, నరేందర్‌ నన్నపనేని, నోముల నర్సింహయ్య, పొదెం వీరయ్య, సోలిపేట రామలింగారెడ్డిలు ఉన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దైవసాక్షిగా, పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు.

తొలిరోజు అసెంబ్లీలో సందడి

  • తెలంగాణ అసెంబ్లీలో తొలిరోజు సందడి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచే సభకు సభ్యుల రాక మొదలయింది. సీఎల్పీ సమావేశం ఉండటంతో కాంగ్రెస్‌ సభ్యులు ముందుగా సభకు వచ్చారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు సభాప్రాంగణానికి వచ్చారు.  
  •  అసెంబ్లీ సమావేశ మందిరం లోపలికి ప్రవేశించే గేటు వద్ద శాసనసభ డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాలోని అధికారులతోపాటు సిబ్బంది బొకేలతో ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు.  
  •  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ ఆవరణను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలదండలు, రంగురంగుల కర్టెన్లతో అసెంబ్లీ ప్రాంగణం కనువిందు చేసింది.
  • అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలను ఫొటోలు తీసేందుకు, చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉత్సాహం చూపారు. కొందరు ఎమ్మెల్యేలు నేరుగా వీడియోలు, కెమెరాల వద్దకు వెళ్లి ఫొటోలకు పోజులిచ్చారు.  
  •  ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేల బంధుమిత్రులతో అసెంబ్లీలోని విజిటర్స్‌ గ్యాలరీ కిటకిటలాడింది.  
  •  సీఎల్పీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాకతో సీఎల్పీ కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది. పెరిగిన బలంతో సభకు వచ్చిన టీఆర్‌ఎస్‌ సభ్యులు సందడి చేశారు.  
  •   జర్నలిస్టుగా పనిచేసిన అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అసెంబ్లీలోకి రాగానే సహచర జర్నలిస్టులంతా అభినందనలు తెలిపారు. మెడలో పెన్నులదండ వేసి స్వాగతం పలికారు.  
  •  కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సీతక్క, హరిప్రియానాయక్‌ ఉదయం నుంచి సభ అయిపోయేవరకు కలిసే ఉన్నారు. హరిప్రియ తొలిసారి అసెంబ్లీకి రావడంతో ఆమెను సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి సభలోకి తీసుకెళ్లారు. ఆమెకు మార్గదర్శనం చేశారు.  
  •  ఎమ్మెల్యేలందరికీ శాసనసభాపక్షాన తిరుపతి, యాదగిరిగుట్ట దేవస్థానాల కేలండర్‌లు, డైరీలు, యాదగిరిగుట్ట లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.  
  •   ఈసారి సభలో వయసురీత్యా పెద్దవారైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చాలా ఉత్సాహంగా కనిపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మె ల్యేలు, జర్నలిస్టులను ఆయన ఆత్మీయంగా పలకరించడం కనిపించింది.  
  •  సీఎల్పీ కార్యాలయం ఎదుట నిల్చొని ఉన్న భట్టి వద్దకు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల వచ్చారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకుని చెవులు కొరుక్కున్నారు.  
  •  స్పీకర్‌ ఎన్నిక కాకపోవడంతో తొలిరోజు సభ్యులకు సమావేశ మందిరంలో స్థానాలు కేటాయించలేదు. ప్రస్తుతానికి వీలున్నచోట కూర్చోవాలని, కొత్త స్పీకర్‌ ఎన్నిక జరిగిన తర్వాత సభ్యులకు అధికారికంగా సీట్లు కేటాయిస్తారని ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీలో ప్రకటించారు.  
  •  యథావిధిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గులాబీ కండువాలతో, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మూడు రంగుల కండువాలతో సభకు హాజరయ్యారు.  
  •   సమావేశ మందిరంలోకి ఎమ్మెల్యేలు వెళ్లే ప్రవేశద్వారాన్ని మార్చారు. ఉమ్మడి ఆంధ్ర«ప్రదేశ్‌లో ఉన్న విధంగా అసెంబ్లీ భవనంలోకి ప్రవేశించగానే మొదటి ఎడమ ప్రవేశ ద్వారం ద్వారా సభ్యులు సమావేశ మందిరంలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ సమయంలో ఈ ద్వారం వైపు ఏపీ మంత్రుల చాంబర్లు ఉండేవి. అప్పుడు రెండో ఎడమ ప్రవేశ ద్వారం నుంచి సభ్యులు సమావేశ మందిరంలోకి వెళ్లేవారు.  
  •  అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు శాసనసభా ప్రాంగణానికి వచ్చారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాంనాయక్, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రాంగణంలో కనిపించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement