ఈ నెల 17న కొత్త అసెంబ్లీ | New MLAs Will Be Sworn On January 17 In Telangana Assembly | Sakshi
Sakshi News home page

ఈ నెల 17న కొత్త అసెంబ్లీ

Published Sun, Jan 6 2019 2:07 AM | Last Updated on Sun, Jan 6 2019 7:48 AM

New MLAs Will Be Sworn On January 17 In Telangana Assembly - Sakshi

ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. జనవరి 17న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మజ్లిస్‌ ఎమ్మెల్యే (చార్మినార్‌) ముంతాజ్‌ ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌ హోదాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. దీనికి ముందే.. ఈ నెల 16న సాయంత్రం ఐదు గంటలకు ముంతాజ్‌ ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేస్తారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ముంతాజ్‌ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు. మరుసటి రోజు శాసనసభ తొలి సమావేశం జరగనుంది. జనవరి 17న ఉదయం 11.30 గంటలకు సభాకార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపు రెండుగంటలపాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగనుంది. అదే రోజున స్పీకర్‌ ఎన్నిక నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటన.. నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.

జనవరి 18న స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. అనంతరం.. స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ ప్రకటన చేస్తారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ను.. శాసనసభా నాయకుడు సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత, ఇతర రాజకీయ పక్షాల నాయకులు గౌరవసూచకంగా స్పీకర్‌ స్థానం వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత కొత్త స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు సాగుతాయి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని స్పీకర్‌ నిర్వహిస్తారు. తర్వాతి రోజు జరిగే గవర్నర్‌ ప్రసంగంపై బీఏసీ నిర్ణయం తీసుకుంటుంది. జనవరి 19న ఉభయసభల (శాసనసభ, శాసనమండలి)ను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. జనవరి 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. గవర్నర్‌ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలుపుతుంది. దీంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. 

మజ్లిస్‌కు రెండోచాన్స్‌ 
మజ్లిస్‌ పార్టీకి శాసనసభలో అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా ఆ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ వ్యవహరించనున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి. మజ్లిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 1984లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పటి వరకు స్పీకర్‌గా వ్యవహరించిన టి. సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయిండ్ల భీంరెడ్డిలు నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో చేరారు. దీంతో అప్పటి శాసనసభ వ్యవహారాల కోసం సల్లావుద్దీన్‌ ఓవైసీ, బాగారెడ్డి, ...... లు ప్రొటెం స్పీకర్లుగా నియమితులయ్యారు. తాజాగా ముంతాజ్‌ ఖాన్‌ కొత్త సభకు నిర్వహణకు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. 
 
సిద్ధమైన అసెంబ్లీ 
శాసనసభ సమావేశాలకు అనుగుణంగా అసెంబ్లీ కొత్త హంగులను సంతరించుకుంది. శాసనసభ, శాసనమండలితోపాటు అసెంబ్లీ ఆవరణ మొత్తాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ ఆవరణలో కొత్త మొక్కలతో పచ్చదనం పెరిగింది. సమాచార, సాంకేతిక, విద్యుదీకరణతో ఆధునిక హంగులు సంతరించుకుంది. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు అన్ని మార్పులతో సభాప్రాంగణాన్ని సిద్ధం చేశారు. శాసనసభ వ్యవహారాల నిర్వహణ తీరును వివరించే పుస్తకాలను ఎమ్మెల్యేలకు పంపిణీ చేసేందుకు ఏర్పాటుచేశారు. అసెంబ్లీ లోపల సైతం ఎమ్మెల్యేలు కూర్చునే సీట్లను, మైక్‌ సెట్లను ఆధునీకరించారు. 
 
ఉత్తరాయణ ఏకాదశి నాడు.. 
కొత్త శాసనసభ సమావేశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని ఆ స్పూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథినాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సాధారణంగానే ముహూర్తాలకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం కేసీఆర్‌ ఉత్తరాయణం ఆరంభంలో కొత్త సభ, స్పీకర్‌ ఎన్నిక వంటి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement