మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ కట్టలేము. ఓటు అనే బ్రహ్మస్త్రంతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశముంది. ఓటరు జాబితాలో పేర్లు చూసుకుని అర్హులైన వారందరూ ఓటు హక్కు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నా పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఈ మేరకు పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వారితో పాటు కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
నేటి నుంచి...
కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల కోసం బుధవారం నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. ఈ మేరకు 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరముంది.
జిల్లాలో 10,26,728 మంది ఓటర్లు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,26,728 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ప్రకారమే తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ జాబితా విడుదల చేసింది. అయినప్పటికీ పలువురు తమ పేర్లు జాబితాలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రస్తుత అవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అర్హులందరిపై ఉందని చెబుతున్నారు.
- 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు ప్రతీ ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అర్హులు.
- గ్రామంలోని బూత్‌లెవల్ అధికారికి లేదా తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫారం–6 దరఖాస్తులు సమర్పించాలి.
- మీసేవా కేంద్రాల్లో లేదా స్వయంగా కానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment