జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్ మంచి ఊపు మీద ఉంది. అదే ఊపును సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జిల్లా టీఆర్‌ఎస్ నాయకత్వానికి మంచి బలాన్ని ఇచ్చాయి. టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ఇంత మెజార్టీ స్థానాలను ‘గులాబీ’లు దక్కించుకోలేదు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లోని 14 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 13 స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహంలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకత్వం త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని.. ఇందులో అత్యధికం ఏకగ్రీవం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేలా...
టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ సమావేశాలు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఈ సందర్భంగా గెలుపునకు సహకరించిన శ్రేణులకు కృతజ్ఞతలు చెబుతూనే సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు తీసుకోవాలని జాగ్రత్తలను వివరిస్తున్నారు. అంతేకాకుండా ఆరు నెలలు కష్టపడి పని చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందంటూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఏకగ్రీవంపై దృష్టి
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ అదే ఊపును పంచాయతీ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మండల నాయకత్వానికి సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉండగా.. జిల్లా యూనిట్‌గా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ మేరకు 721 పంచాయతీలకు గాను 307 జనరల్‌కు కేటాయించారు.
బీసీలకు 170 స్థానాలు, ఎస్సీలకు 107 స్థానాలు, వంద శాతం గిరిజనుల జనాభా ఉండి జీపీలుగా మారిన 107 తండాలను కలుపుకుని 137 స్థానాల ను ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ మేరకు ఇందులోఅత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిన నేపథ్యంలో... ఆ ఓటమి నుంచి కోలుకోకముందే గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చేశాయి. దీంతో కాంగ్రెస్ తేరుకునే లోగా సర్పంచ్ స్థానాలను కూడా టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే విధంగా స్థానిక నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు సమాయత్తం చేస్తున్నారు.
29న జిల్లాకు కేటీఆర్
టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి న విషయం విదితమే. గత నాలుగన్నరేళ్ల క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. సంస్థాగతంగా బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదని పార్టీ నాయకులే స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. తన కుమారుడైన కేటీఆర్‌ను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.
దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో పార్టీ సమావేశాలు ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్... ఈనెల 29న మహబూ బ్‌నగర్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మహబూబ్‌నగర్ నియోజకర్గ పా ర్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని రానున్న గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో సత్తా చాటేలా పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహరచన చేయనున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment