ఓటు హక్కు నమోదుపై షాద్‌నగర్ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
షాద్‌నగర్‌టౌన్: ఓటు హక్కు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. బుధవారం నుంచి ఓటరు సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు చాలా మంది ఉత్సాహం కనబర్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాం తాల నుంచి స్వగ్రామాలకు వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్తే ఓటరు జాబితాలో పేరు లేదని తెలుసుకుని ఆవేదనచెందారు.
కొందరు ఆగ్రహంతో అధికారులను నిలదీశారు. జాబితాలో తమ పేరు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దీనికి అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు వేల సంఖ్యలో ఓటరు జాబితా నుంచి పేర్లు మాయమయ్యాయి. చాలా మండలాల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఎన్నికల సంఘం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
సవరణ ప్రక్రియ ప్రారంభం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం మరో మారు ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఓటు హక్కు నమోదు కోసం ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌వీఎస్‌పీ.ఐఎన్ లింక్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి విచారణ చేపట్టి ఓటు హక్కు కల్పిస్తారు. 2019 జనవరి 1 తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు, గతంలో ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎన్నికల సంఘం బుధవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తుంది. జనవరి 25 తేదీ వరకు అభ్యంతరాలు, వినతులను అధికారులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11లోపు వాటిని పరిశీలించి ఫిబ్రవరి 22న తుది జాబితాను ప్రకటిస్తారు. ఓటు హక్కు కోల్పోయిన వారు ఆలస్యం చేయకుండా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటు హక్కు నమోదు పట్ల నిర్లక్ష్యం వహించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment