కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతమున్న 34 శాతం రిజర్వేషన్లను యథాతధంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఏం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. ఈ రెండు డిమాండ్ల సాధన కోసం గురువారం లక్డీకపూల్‌లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, బీసీ సబ్‌ప్లాన్ రాష్ట్ర కార్యదర్శి కిల్లె గోపాల్ మాట్లాడుతూ.. జనాభాలో 53 శాతం ఉన్న బీసీలకు భిన్నంగా రిజర్వేషన్లు నిర్వహించడం అవమానిండమేనని అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
దీన్ని కాదని 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించడమేంటని ప్రశ్నించారు. అనాలోచిత నిర్ణయంతో సీఎం కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలు తదితర సంచార జాతులకు స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించేందుకు వీలుగా బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలంతా ఏకమై సీఎం కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ డీఎస్ లోకేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు పి.యాదయ్య, ఎం.చంద్రమోహన్, డి.రాంచందర్, నాయకులు ఇ.నర్సింహ, ఎన్.రాజు, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment