సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు హక్కు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత మూడు నెలల్లో 1.90 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆన్‌లైన్ విధానంలో అందిన దరఖాస్తులే. అధికారులకు నేరుగా మరో 30వేలకు పైగా అంది ఉంటాయని అంచనా. ఈనెల 4వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది యువత ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
అత్యధికంగా మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి 30వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులని అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చింది. అంతేగాక ఓటు నమోదు కోసం ఈనెల 2న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బూత్‌లెవల్‌లో క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దీని ఫలితంగానే అధిక సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే 80 వేల మంది
కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను (ఫారం–6) అధికారులు వడబోస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉంటున్నారా లేదా అని ఆరాతీస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఓటు హక్కు కల్పిస్తున్నారు. 1.90 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు 87 వేలకుపైగా ఆమోదించారు. వీటిలో 80 వేలకుపైగా ఓటర్ల వివరాలను జాబితాలో నమోదు చేశారు. 96 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. దాదాపు ఏడు వేల దరఖాస్తులను తిరస్కరించారు.
భారీగా తొలిగింపు
ఓటు హక్కు తొలగింపునకు 15 వేలకుపైగా ఓటర్లు దరఖాస్తులు సమర్పించారు. పట్టణ ప్రాంత, నగర శివారు నియోజకవర్గాలైన ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వచ్చి నివసిస్తున్నారు. వీరంతా తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి ఓటును జాబితా నుంచి తొలగించుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు అధికంగా వచ్చాయని పేర్కొంటున్నారు.
అంతేగాక కొందరు తమ నివాసాన్ని ఒక నియోజకవర్గం నుంచి మరొక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి మార్చి ఉండొచ్చు. ఇటువంటి వారంతా ఓటు తొలగింపునకు ఫారం–7ను అందచేశారు. ఇప్పటివరకు 10వేల పైచిలుకు ఓట్లను తొలగించారు. అలాగే పేరు, ఇంటిపేరు, నివాస చిరునామా, పుట్టిన తేదీ తదితర చేర్పులు మార్పుల కోసం 25వేలకుపైగా దరఖాస్తులు అందాయి. పోలింగ్ స్టేషన్ మార్పు కోసం 4వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు.
22న ముసాయిదా జాబితా
కొత్తగా ఓటు నమోదు, పోలింగ్ స్టేషన్ మార్పు, తొలగింపులు, చేర్పులు, మార్పుల కోసం అందిన దరఖాస్తులను యంత్రాంగం పరిశీలిస్తోంది. ఇప్పటికే సగానికిపైగా పరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈనెల 22న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల నాటికి జిల్లాలో 28.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరింత కొందరికి ఈ జాబితాలో చోటుదక్కే అవకాశం. ఫలితంగా జిల్లా ఓటర్ల సంఖ్య 29 లక్షల మార్క్‌ను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment