ఆకాశంలో సగం అన్న కవుల వర్ణనలోనే కాదు జిల్లా ఓటర్ల జాబితాలో కూడా మహిళలు సగభాగం ఆక్రమించారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆకాశంలో సగం అన్న కవుల వర్ణనలోనే కాదు జిల్లా ఓటర్ల జాబితాలో కూడా మహిళలు సగభాగం ఆక్రమించారు. జిల్లాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహిళల పాత్ర కీలకం కానుంది. జిల్లాలోని మొత్తం ఓటర్లలో దాదాపు సగభాగం ఉన్న మహిళా ఓటర్లు నేతల తలరాతలు మార్చనున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 50,00,723 ఓటర్లుండగా... అందులో 23,25,652వ ుంది మహిళలే. మిగిలిన అన్ని నియోజకవర్గాలతో పోల్చితే శేరిలింగంపల్లిలో అత్యధిక సంఖ్యలో 2,39,727 మంది మహిళా ఓటర్లున్నారు.
తాండూరు శాసనసభ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం విశేషం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,84,933 మంది ఓటర్లుంటే అందులో 93,463మంది మహిళలున్నారు. మండలాల విషయానికొస్తే బషీర్‌బాద్ మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. మండలంలో 16,106 మహిళా ఓటర్లుండగా... పురుషులు 15,141. పెద్దేముల్ మండలంలో మహిళా ఓటర్లు పురుషుల కంటే స్వల్ప సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 18,829మంది మహిళలుండగా, 18,297మంది పురుష ఓటర్లున్నారు.
సంఖ్య... చైతన్యం రెండూ పెరిగాయి
గతంలో కంటే ఈసారి జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామంలో మహిళలే గెలుపోటములు నిర్ణయించే స్థానంలో ఉన్నారు. ఓటర్ల సంఖ్యతో పాటు మహిళల్లో చైతన్యం కూడా పెరిగింది. భర్త, కుటుంబ సభ్యుల ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా ఓటేసే పరిస్థితులున్నాయి. అధికంగా పట్టణ, నగర నాగరికత ఉండడంతో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే మహిళల శాతం మన జిల్లాలోనే అధికంగా ఉండనుంది. మహిళలు ఎవరి వైపు మొగ్గితే గెలుపు వారిదే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నేతలు తెగ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే, గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా యువతులు, బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళలు ఓటు ద్వారా నేతలకు బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నారు. ఫలితంగా ఈ సారి ఓటు వేసే మహిళల సంఖ్య గతంలో కంటే గణనీయంగా పెరగనుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తమ రక్షణ, సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేసే పార్టీలకే మద్దతు పలకాలన్న సంకల్పం విద్యావంతులైన మహిళల్లో బలంగా ఉంది. వీరి సంకల్పంతో ఏయే పార్టీలు, వాటి నేతల తలరాతలు మారుతాయో ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.