ఇటీవల రమేష్ హత్య జరిగిన ప్రాంతంలో దగ్గరలోనే లాఠీలతో ఉన్న కానిస్టేబుళ్లు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం పట్టపగలు జరిగిన రమేష్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులే కాదు.. సామాన్యులనూ ఉలిక్కిపడేలా చేసింది. రమేష్‌ను ఇద్దరు వ్యక్తులు వెంటాడి మరీ నరుకుతుంటే పోలీసులు సమీపంలో ఉండి కూడా స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏ కష్టమొచ్చినా, ముప్పు ఎదురైనా ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే. అలాంటి ఖాకీలే చేష్టలుడిగి చూస్తుంటే తమకు ఇక రక్షణ ఎక్కడన్నది ఇప్పుడు ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ‘ఆధునికత’ అంటూ దూసుకుపోతున్న పోలీసింగ్‌లో ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీస్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వచ్చినా ఉపయోగమేంటి?
అత్తాపూర్‌లో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఛేజింగ్ జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు వెంటాడుతూ చంపడానికి ప్రయత్నించారు. ‘డయల్–100’కు ఫోన్ చేసినా.. ఐదు నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉది.. అయితే అలా వచ్చిన పోలీసుల స్పందన ఏంటన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రమేష్‌ను హత్య చేస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసు వాహనంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందులోంచి దిగిన ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ప్లాస్టిక్ లాఠీలతో హతుడు, హంతకుల సమీపం నుంచి తిరిగారే తప్ప అడ్డుకోవడానిగాని, హంతకులను బంధించడాని గాని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఫోన్ వచ్చాక ఎంత తక్కువ సమయంలో స్పందించినా ఉపయోగమేంటనే ప్రశ్న తలెత్తుతోంది.
ఆయుధం ఉంటే తప్పేంటి?
రమేష్ హత్య ఉదంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుళ్లు సరిగ్గా స్పందించక పోవడానికి ప్రధాన కారణం వారు నిరాయుధులై ఉండడం. ఆయుధం అవసరం లేని ట్రాఫిక్ పోలీసులు.. అవసరమైన క్రైమ్ పోలీసులు సైతం ‘ఒట్టి చేతుల తో’ ఉండాల్సి వచ్చింది. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాలు అమల్లోకి వచ్చాక ఆయుధాలు అటకెక్కాయి. ఒకప్పుడు ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు రివాల్వర్స్ లేదా పిస్టల్స్, ఆ కింద స్థాయి సిబ్బంది వద్ద 303 లేదా ఎస్‌ఎల్‌ఆర్‌లు ఉండేవి. ఆయుధం పోలీసులకు యూనిఫాంలో భాగమే కాదు.. శరీరంలో భాగం లాంటిదని వారికి శిక్షణ నుంచే చెబుతుంటారు. అలాంటిది ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఈ ఆయుధాలను పక్కన పెట్టేశారు.
చంపైనా ప్రాణాలు కాపాడుకునే అవకాశం..
సమాజంలో ప్రతి వ్యక్తికీ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉంటుంది. దాడి చేస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చంపైనా తనను తాను కాపాడుకునే అవకాశాన్ని చట్టం సామాన్య ప్రజలకే కల్పించింది. పోలీసులకు కూడా కళ్ల ముందు దారుణం జరుగుతుంటే దుండగులను కాల్చడమో, గాల్లోకి కాల్పులు జరిపి నిలువరించి పట్టుకోవడమో చేసే అధికారం ఉంటుంది. అత్తాపూర్ ఉదంతంలో ఆ కానిస్టేబుళ్ల వద్ద తుపాకీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు.
రాజధానిలోనూ ఇదే పరిస్థితా?
‘సాఫ్ట్ టార్గెట్’గా పేరున్న హైదరాబాద్ అనునిత్యం ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంటుంది. స్థానిక ఉగ్రవాదుల నుంచి జాతీయ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల వరకు అదను చూసి గురిపెడుతుంటాయి. నిత్యం కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి రాజధాని నగరంలో నిరాయుధులతో పోలీసింగ్ సురక్షితం కాదని పోలీస్ శాఖకు చెందిన నిపుణులు చెబుతున్నారు. బృందాలుగా రంగంలోకి దిగడం, బాంబు పేలుళ్ల వంటివి కాకుండా తుపాకులతో జనసమర్థ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. సామాన్యులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఉదంతమే పోలీసులకు ఎదురైతే పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు తెచ్చుకోవడమో, ‘ఇంటర్‌సెప్షన్’ వాహనాన్ని పిలవడమో చేయాలి. (ఈ వాహనాల్లోనే ఆయుధాలతో పోలీసులు ఉంటారు. ఇలాంటివి 17 వెహికల్స్ సిటీలో మాత్రమే ఉన్నాయి) ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. బ్యాంకుల వద్ద కాపలా కాసే సెక్యూరిటీ గార్డుల వద్దే తుపాకీ ఉండగా పోలీసుల వద్ద ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మూడు కమిషనరేట్లలో పరిస్థితి ఇదీ..
- రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో కలిపి 140 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
- గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని మినహాయించినా మిగిలిన వాటిలో ప్రతి ఠాణాకు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా 3 చొప్పున పెట్రోలింగ్ కోసం ఇన్నోవా వాహనాలు ఉన్నాయి.
- ఒక్కో వాహనంలో డ్రైవర్ సహా నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరికి హెడ్–కానిస్టేబుల్ లేదా ఏఎస్సై నేతృత్వం వహిస్తారు.
- ఆ వాహనంలో ప్రాథమిక చికిత్స చేసే కిట్లు, రెయిన్‌కోట్లు, కోన్స్‌లతో పాటు ప్లాస్టిక్ లాఠీలే ఉంటున్నాయి.
- అతి తక్కువ వాహనాల్లో మాత్రమే ‘స్టోన్ గార్డ్’ (రాళ్లు తగలకుండా ధరించే కోట్లు) వంటివి ఉంటున్నాయి.
- ప్రతి ఠాణాకు 2 నుంచి 4 వరకు పెట్రోలింగ్ బైక్‌లు (బ్లూకోల్ట్స్) ఉన్నాయి.
- దీనిపై ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున తమ పరిధుల్లో గస్తీ నిర్వహిస్తుంటారు.
- వీరి వద్ద వాకీటాకీ, ట్యాబ్, సెల్‌ఫోన్ మినహా కనీసం లాఠీ కూడా ఉండదు. అవసరమైనప్పుడే లాఠీలు పట్టుకెళతారు.
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డివిజన్‌కు ఒకటి చొప్పున మొత్తం 17 ‘ఇంటర్‌సెప్టార్’ వాహనాలు ఉన్నాయి.
- ఒక్కో డివిజన్‌లో 3 నుంచి 5 ఠాణాలు ఉండగా.. ఈ వాహనాల్లోని సిబ్బంది వద్ద మాత్రమే తుపాకులు ఉంటున్నాయి.
అదుపు తప్పిన సందర్భాల్లేవ్..
చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఫ్రెండ్లీ పోలీసింగ్ అటకెక్కుతుందని భావించడం సమంజసం కాదన్నది నిపుణుల మాట. నాలుగేళ్ల కిందటి వరకు అన్ని స్థాయిల అధికారుల వద్దా ఆయుధాలు ఉండేవి. దోపిడీ, బందిపోటు ముఠాల కదలికల నేపథ్యంలో ఉమ్మడి సైబరాబాద్‌లో కానిస్టేబుళ్లు ఎస్‌ఎల్‌ఆర్‌లతో పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పటి వరకు పోలీసులు అదుపు తప్పిన, విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సందర్భాలు లేనేలేవు. గడిచిన 15 ఏళ్లలో చూసినా మక్కా మసీదులో పేలుడు జరిగిన 2007 మే 18న మాత్రమే పోలీసు తూటా పేలింది. అది కూడా అల్లరిమూకలు పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికే కాల్పులు జరిపారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎలాంటి కాల్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల వెంట తుపాకులు ఉంటే తప్పేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment