నగరాల్లో మావోయిస్టు పార్టీ నెట్‌వర్క్‌కు చెక్‌! | Telangana Police Focus On Maoists Movements | Sakshi
Sakshi News home page

అనుబంధ సంఘాలపై పోలీసుల వేట

Published Wed, Dec 26 2018 2:48 AM | Last Updated on Wed, Dec 26 2018 10:25 AM

Telangana Police Focus On Maoists Movements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుల వేట దిశ మారింది. అర్బన్‌ మావోయిజాన్ని అణచివేసే చర్యలు చేపట్టారు. అడవుల్లో మావోయిస్టుల కోసం వేట సాగించే పోలీస్‌ శాఖ ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో అనుబంధ సంఘాలపై దృష్టి పెట్టింది. బీమా కోరేగావ్‌ ఉదంతం మొదలు తాజాగా అరెస్టయిన మావోయిస్టు మహిళా సానుభూతిపరుల వ్యవహారం వరకు అర్బన్‌ హంటింగ్‌ను స్పష్టం చేస్తోంది.  

మావోయిస్టు పార్టీకి తోడ్పాటు... 
మావోయిస్టు పార్టీ తను చెప్పాలనుకున్న అంశాలు, జనాల్లోకి వ్యాప్తి చేయించాల్సిన కార్యకలాపాలను ఫ్రాక్షన్‌ కమిటీల ద్వారా పంపిస్తుంది. అయితే, అనుబంధ సంఘాలు వివిధ రూపాల్లో మావోయిస్టు పార్టీకి మద్దతుగా పనిచేస్తు న్నాయని ముందునుంచి పోలీస్‌ శాఖ ఆరోపిస్తూ వస్తోంది. కానీ, నేరుగా ఆ సంఘాల సభ్యులనుగానీ, బాధ్యులను గానీ మావోయిస్టులుగా గుర్తించి అరెస్ట్‌ చేయలేదు. బీమా కోరేగావ్‌ వ్యవహారంలో మావోయిస్టు అనుబంధ సం«ఘ సభ్యులుగా ఉన్న తెలంగాణకు చెందిన వరవరరావు, ఫరీదాబాద్‌కు చెందిన సుధా భరద్వాజ్, ముంబైకి చెందిన అరుణ్‌ ఫెరారియా, గన్సల్వేస్, న్యూఢిల్లీ జర్నలిస్టు నవలఖను పుణే పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరంతా మావోయిస్టు పార్టీకి తోడ్పాటు అందిస్తూ నగరాల్లో, పట్టణాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారని ఆరోపించారు.  

ప్రొఫెసర్‌ సాయిబాబా ఎపిసోడ్‌... 
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా పౌర హక్కుల సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనతోపాటు జేఎన్‌యూ విద్యార్థి హేమా మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్‌ రాహీలను పోలీసులు అరెస్టు చేయగా.. వీరంతా నాగ్‌పూర్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. 

వెంకట్రావ్, భవానీ, అన్నపూర్ణ, అనూష... 
రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ విధానాలకు ఆకర్షితుడైన ఎన్‌జీఆర్‌ఐ ఉద్యోగి నక్కా వెంకట్రావ్‌ 33 ఏళ్లుగా మావో యిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ శాఖ ఆరోపించింది. ఏపీలోని పాడేరు పోలీసులు అరెస్ట్‌ చేసిన ముగ్గురు మహిళలు(అక్కాచెల్లెళ్లు) ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా ఉండటంతోపాటు చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్‌)లో పనిచేస్తున్నారు. అనూష మావోయిస్టు పార్టీ దళసభ్యురాలిగా పనిచేస్తోందని తెలిపారు. వీళ్ల తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితి, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నేతగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి అరెస్ట్‌ రెండు రాష్ట్రాల పౌర హక్కుల నేతలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది.  

అనూష చేసిన నేరాలు... 
మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలిగా ఉన్న అనూష ఈ ఏడాది ఫిబ్రవరిలో తిక్కరపాడు వద్ద మాటువేసి పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఏడాది మేలో పాన్‌పోదార్, జుడంబో గ్రామంలో పోలీసు వాహనాలపై దాడులు, నవంబర్‌లో ఒడిశా సుర్మతి ఏవోబీ సరిహద్దులో రెక్కీ చేసి పోలీసులపై మందుపాతరలతో దాడి చేసింది.

రిక్రూట్‌మెంట్‌ వెనుక అనుబంధ సంఘాలు? 
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో నిరుద్యోగ యువతను ఉద్యమాల పేరుతో మావోయిస్టుపార్టీ వైపు మళ్లించేందుకు అనుబంధ సంఘాలు ప్రయత్నిస్తున్నా యని తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా గతంలో మావోయిస్టు పార్టీలో చేరేందుకు యత్నించిన 32 మందిని తెలంగాణ ఎస్‌ఐబీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చింది. వీరికి ఆంధ్రా ఒడిశా బార్డర్‌(ఏవోబీ) కమిటీ కారద్యర్శి హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ ప్రోత్సాహం ఉందని బయటపడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన వ్యవహారంలో రామకృష్ణ యాక్షన్‌ ప్లానే అమలు చేశారని ని ఘా వ్యవస్థ గుర్తించింది. ఇలా 2 రాష్ట్రాల్లో ఎంతమందిని రిక్రూట్‌ చేశారు? వారిప్పుడు ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుబంధ సంఘాలను నియంత్రిస్తే గానీ రిక్రూట్‌మెంట్‌ను ఆపలేమని ఇరు రాష్ట్రాల పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.   

అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది 
అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మంగళవారం ఆరోపించారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని అనిశ్చితి నెలకొందన్నారు. చట్టబద్ధమైన, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధంగా నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తున్నారని విమర్శించారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ప్రజలపై నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ గత ఐదేళ్లుగా అనుసరించిన నిర్బంధాన్ని తిరిగి కొనసాగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఈ నిర్బంధం వల్ల సమాజంలో హింస పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పాలనకు విరుద్దంగా రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా పరిపాలన ఉందని విమర్శించారు.   

 ‘మా పిల్లలకు సంబంధం లేదు’ 
తమ పిల్లలకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన భవానీ, అన్నపూర్ణ, అనూషల తల్లిదండ్రులు రమణయ్య, లక్ష్మీనర్సమ్మలు అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పెద్ద కూతురు భవానీ టైలరింగ్‌ చేస్తుండగా, మిగతా ఇద్దరు అన్నపూర్ణ, అనూషలు మహిళా సంఘాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పిల్లలను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement