prof haragopal
-
విద్యా కమిషన్‌కు సలహా కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా కమిషన్‌కు ఆరుగురితో సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రొఫెసర్ హరగోపాల్, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు కె.మురళీ మోహన్, కె.వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎంవీఎఫ్ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి, యూనిసెఫ్ విద్యా నిపుణుడు కె.ఎం.శేషగిరి ఈ కమిటీలో ఉన్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కమిషన్ సభ్యులను కూడా నియమించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత ఉన్నతస్థాయికి చేర్చడానికి వీలుగా ఈ సలహా కమిటీ కమిషన్‌కు సూచనలు చేస్తుంది. -
మూలాల్లోకి వెళ్తే సక్సెస్ మీదే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పుస్తకాలపై దృష్టికన్నా, సడలని ఆత్మ విశ్వాసమే అసలైన ఆయుధమని సామాజిక వేత్త, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షల సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ చెప్పారు. పైపైన చదవకుండా, మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసిన వారే పరీక్షల్లో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. విస్తృత భావజాలంతో గ్రూప్–1 సిలబస్‌ను రూపొందించామని.. విశాల ఆలోచనా ధోరణితో అవగాహన చేసుకుంటే అభ్యర్థులు సునాయాసంగా గెలుపు బాట పట్టవచ్చని తెలిపా రు. గ్రూప్స్ పరీక్షల నేపథ్యంలో హరగోపాల్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. స్థానిక చరిత్రకే ప్రాధాన్యం తెలంగాణ ఏర్పాటు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశాల దృక్పథంతో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశలోనే పరీక్ష సిలబస్ విభిన్నంగా ఉండాలని నేను చైర్మన్‌గా 18 మందితో ప్రభుత్వం కమిటీ వేసింది. అందులో కోదండరాం, చుక్కా రామయ్య సహా పలువురు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ నేపథ్యం. భౌగోళిక పరిస్థితులకు ప్రాధాన్యమిచ్చాం. ఈ అంశాల నుంచే 50 మార్కులకు పేపర్ ఉంటుంది. రాష్ట్ర పరిణామాలపై జనరల్ నాలెడ్జ్, ఆంగ్ల భాషా నైపుణ్యం (టెన్త్ స్టాండర్డ్స్)పై కనీస అవగాహన ఉండాలి. మేథ్స్ను కూడా సిలబస్‌లో జోడించాలనుకున్నాం. కానీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో చేయలేకపోయాం. ఇంటర్వ్యూ ఉంటేనే మేలు పాలనా సామర్థ్యం, ప్రజలతో డీల్ చేసే విధానం, వ్యక్తిత్వ వికాసం వంటివి ఇంటర్వ్యూ ద్వారానే తెలుస్తాయి. యూపీఎస్సీ కూడా ఇంటర్వ్యూకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇంటర్వ్యూ తీసేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా ఉండాలనే కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు తొలగించారు కాబట్టి రాతపరీక్షలోనే సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి. లోతుగా అధ్యయనం చేయాలి భారత రాజ్యాంగాన్ని లోతుల్లోకి వెళ్లి చదవాలి. ఉదాహరణకు ఆర్టికల్–3. నాటి దేశ పరిస్థితులను బట్టి దానిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దేశం సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని అప్పట్లో అంబేడ్కర్ ప్రతిపాదించారు. ఇలా లోతుగా తెలుసుకుంటేనే గ్రూప్స్ రాసే విద్యార్థులకు సమగ్ర అవగాహన ఉంటుంది. సులువుగా విజయం సాధిస్తారు. ఆదేశిక సూత్రాలను సూచించే పార్ట్–4 చాలా ముఖ్యం. ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనేది దీని నుంచే సమగ్రంగా తెలుసుకోవచ్చు. రాజ్యాంగం పార్ట్–3లో పౌరులకు స్వేచ్ఛ ఇస్తే.. పార్ట్–4లో సామాజిక న్యాయం ఉంటుంది.› ఈ రెండింటికీ మధ్య లింక్‌ను తాత్విక, సామాజిక కోణంలో అవగతం చేసుకున్న విద్యార్థి.. ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలడు. ఇలాంటివాటిని గైడ్ ద్వారా ఫాలో అవడం కష్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి మాత్రమే కాకుండా.. వాటి నేపథ్యం తెలుసుకుంటే మంచి మార్కులొస్తాయి. జనరల్ ఎస్సే విషయంలో సమకాలీన పరిస్థితులను ఎక్కువ అ«ధ్యయనం చేయాలి. నదీజలాలు, పర్యావరణ సమస్యలు వంటి తాజా పరిణామాలు, గత చరిత్ర తెలుసుకోవాలి. ఆత్మ విశ్వాసమే అసలు ఆయుధం ఒక్కో అభ్యర్థి ఒక్కో రకమైన భావజాలంలో ఉంటారు. గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ముందుగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అదే అసలైన ఆయుధం. యూనివర్సిటీలు విద్యార్థులకు అందించాల్సింది ఇదే. ఈ మధ్య ప్రత్యేక కోచింగ్ సెంటర్లు పెడుతున్నారు. ఏపీ స్టడీ సర్కిల్, తెలంగాణ స్టడీ సర్కిళ్ల పేరుతో ప్రభుత్వాలే నడుపుతున్నాయి. అక్కడ చేయాల్సిందల్లా అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. ఇంగ్లిష్ భాష అంటే భయపడొద్దు. కనీస పరిజ్ఞానం పొందితే చాలు. గ్రూప్–1 అధికారికి భాష ప్రధానం కాదు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే శక్తి ఉండాలి. తెలిసినది కాదు.. అడిగింది రాయాలి.. పోటీ పరీక్షల్లో ఎప్పుడూ ప్రశ్నలను ట్విస్ట్ చేసి ఇస్తారు. చాలామంది ఈ విషయాన్ని సరిగా గమనించరు. మనకు తెలిసింది రాయాలనే ఉత్సాహం పరీక్షలో సరికాదు. పరీక్షలో అడిగింది రాయడమే ముఖ్యం. ప్రశ్నను రెండు మూడుసార్లు జాగ్రత్తగా చదవాలి. జవాబు రాసేప్పుడూ ప్రశ్నను మరోసారి చదవాలి. అప్పుడే సమాధానం సరిగా రాస్తున్నది లేనిది తెలుస్తుంది. అడిగింది రాసిన అభ్యర్థులు పాసవుతారు. యూపీఎస్సీలో గతంలో వచ్చిన పేపర్లు తెచ్చుకోవాలి. వాటిల్లోంచి కొన్ని ప్రశ్నలు ఎంపిక చేసుకోవాలి. పుస్తకాల నుంచి సమాధానం సంగ్రహించాలి. తర్వాత పుస్తకాలు చూడకుండా సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. వాటిని నిపుణులకు చూపించి ఎలా ఉందో, ఇంకెలా రాయోలో తెలుసుకోవాలి. దీనివల్ల మంచి మార్కులు వచ్చే వీలుంది. కోచింగ్ సెంటర్లది వ్యాపారమే.. చాలా కోచింగ్ సెంటర్లు వ్యాపార ధోరణిలో వెళ్తున్నాయి. స్టడీ మెటీరియల్స్ లక్షల్లో అమ్ముడుపోతాయి. కానీ వాటిని ఏ విధమైన నైపుణ్యం లేని వ్యక్తులతో రూపొందిస్తున్నారు. ఎలాంటి అవగాహన లేని మెటీరియల్స్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. తెలంగాణపై జయశంకర్, అడపా సత్య నారాయణ వంటివారు రాసిన పుస్తకాలు చదవాలి. తెలుగు అకాడమీ డీలా పడింది గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకం, మెటీరియల్‌ను కొనొద్దు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెటీరియల్ అందించే క్రమంలో ఒక్కోసారి తెలుగు అకాడమీ కూడా తప్పులు చేస్తోంది. ఉదాహరణకు ‘అనార్కిజం’అనే పదాన్ని ‘అరాచకవాదం’అని తర్జుమా చేశారు. అనార్కిజం అంటే పరిమితుల్లేని స్వేచ్ఛ. ఇదో ఫిలాసఫీ. సబ్జెక్టుపై సమగ్ర అవగాహన ఉంటేనే ఇలాంటివన్నీ గుర్తించడం సాధ్యమవుతుంది. గైడ్లు తయారుచేసే వాళ్లకు ఇవి తెలియవు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో తెలుగు అకాడమీ ముందుండాలి. ఓపెన్ యూనివర్సిటీ రంగంలోకి దిగాలి. అనుభవజ్ఞులతో స్టడీ మెటీరియల్ అందించాలి. అకాడమీ గందరగోళంలో ఉంది. పుస్తకాలు ప్రింట్ చేయడం లేదు. కీలక సమయంలో డీలా పడింది. ఇప్పటికైనా విద్యార్థులకు చేయూతగా ఉండాలి. -
ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాల్ని ఆపాలి: హరగోపాల్
హైదరాబాద్: ప్రజా ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాలను ఆపాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. భూమి కింద ఉన్న అభివృద్ధిని చూస్తున్నారు కాని భూమిపైన ఉన్న మనుషుల్ని చూడటంలేదని, మనుషుల కోసమే అభివృద్ధి అని ఇప్పుడు వారినే విధ్వంసం చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని, సహజ వనరులు ఉండటమే ప్రజలు చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఈ విధ్వంసం నుంచి దూరం కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాష్ట్రం ఏర్పడ్డాక మార్పు ఉంటుందని భావించామని, కాని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గత పాలకులు చేసినట్టుగానే వ్యవహరిస్తోం దని విమర్శించారు. జాతీయత, దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు వనరులను కాపాడుతుందనుకుంటే పరుగెత్తి మార్కెట్‌ను పూర్తిగా ఓపెన్ చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియంను బయటకు తీశామంటే అది విషంగా మారుతుందని, గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించారు. నదులు, నీరు, గాలి విషతుల్యమై ఆదివాసీలతో పాటు హైదరాబాద్ ప్రజలు కూడా విషపు నీరు తాగాల్సి వస్తుందని, అలాంటి అభివృద్ధి అవసరమా అని టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించారు. ఇది కేవలం నల్లమల సమస్య కాదని, అమరావతి, హైదరాబాద్‌కు కూడా ప్రమాదకరమన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్బంధం పెంచిన ప్రతీ పార్టీ ఓడిపోయింది
హైదరాబాద్: తెలుగు నేలపై నిర్బంధం పెంచిన ప్రతీ పార్టీ ఓడిపోయిందని, ఎన్నికల్లో విజయాన్ని సాధిం చిన ఎన్టీఆర్, చంద్రబాబులు ప్రజాసంఘాలపై నిర్బంధం పెంచాకే భారీ ఓటమిని చవిచూశారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ కూడా గుర్తించాలని ఆయన సూచించారు. ఉపా చట్టం రద్దు, ప్రజాసంఘాల నాయకురాళ్లు భవాని, అన్నపూర్ణ, అనూషల అక్రమ అరెస్టుపై చైతన్య మహిళా సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవాని, అన్నపూర్ణ, అనూషలపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పీవోడబ్ల్యూ సంధ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ..ప్రభుత్వ విధానాలు ప్రశ్నిస్తున్న వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అణచివేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో చైతన్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి శిల్ప, అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, ప్రొఫెసర్ కాశీం, పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణ, బాధిత తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ, రమణయ్యలు పాల్గొన్నారు. -
నగరాల్లో మావోయిస్టు పార్టీ నెట్‌వర్క్‌కు చెక్!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల వేట దిశ మారింది. అర్బన్ మావోయిజాన్ని అణచివేసే చర్యలు చేపట్టారు. అడవుల్లో మావోయిస్టుల కోసం వేట సాగించే పోలీస్ శాఖ ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో అనుబంధ సంఘాలపై దృష్టి పెట్టింది. బీమా కోరేగావ్ ఉదంతం మొదలు తాజాగా అరెస్టయిన మావోయిస్టు మహిళా సానుభూతిపరుల వ్యవహారం వరకు అర్బన్ హంటింగ్‌ను స్పష్టం చేస్తోంది. మావోయిస్టు పార్టీకి తోడ్పాటు... మావోయిస్టు పార్టీ తను చెప్పాలనుకున్న అంశాలు, జనాల్లోకి వ్యాప్తి చేయించాల్సిన కార్యకలాపాలను ఫ్రాక్షన్ కమిటీల ద్వారా పంపిస్తుంది. అయితే, అనుబంధ సంఘాలు వివిధ రూపాల్లో మావోయిస్టు పార్టీకి మద్దతుగా పనిచేస్తు న్నాయని ముందునుంచి పోలీస్ శాఖ ఆరోపిస్తూ వస్తోంది. కానీ, నేరుగా ఆ సంఘాల సభ్యులనుగానీ, బాధ్యులను గానీ మావోయిస్టులుగా గుర్తించి అరెస్ట్ చేయలేదు. బీమా కోరేగావ్ వ్యవహారంలో మావోయిస్టు అనుబంధ సం«ఘ సభ్యులుగా ఉన్న తెలంగాణకు చెందిన వరవరరావు, ఫరీదాబాద్‌కు చెందిన సుధా భరద్వాజ్, ముంబైకి చెందిన అరుణ్ ఫెరారియా, గన్సల్వేస్, న్యూఢిల్లీ జర్నలిస్టు నవలఖను పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా మావోయిస్టు పార్టీకి తోడ్పాటు అందిస్తూ నగరాల్లో, పట్టణాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ సాయిబాబా ఎపిసోడ్... ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా పౌర హక్కుల సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనతోపాటు జేఎన్‌యూ విద్యార్థి హేమా మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహీలను పోలీసులు అరెస్టు చేయగా.. వీరంతా నాగ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. వెంకట్రావ్, భవానీ, అన్నపూర్ణ, అనూష... రాడికల్ స్టూడెంట్ యూనియన్ విధానాలకు ఆకర్షితుడైన ఎన్జీఆర్ఐ ఉద్యోగి నక్కా వెంకట్రావ్ 33 ఏళ్లుగా మావో యిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ ఆరోపించింది. ఏపీలోని పాడేరు పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళలు(అక్కాచెల్లెళ్లు) ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా ఉండటంతోపాటు చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్)లో పనిచేస్తున్నారు. అనూష మావోయిస్టు పార్టీ దళసభ్యురాలిగా పనిచేస్తోందని తెలిపారు. వీళ్ల తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి అరెస్ట్ రెండు రాష్ట్రాల పౌర హక్కుల నేతలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. అనూష చేసిన నేరాలు... మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలిగా ఉన్న అనూష ఈ ఏడాది ఫిబ్రవరిలో తిక్కరపాడు వద్ద మాటువేసి పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఏడాది మేలో పాన్పోదార్, జుడంబో గ్రామంలో పోలీసు వాహనాలపై దాడులు, నవంబర్‌లో ఒడిశా సుర్మతి ఏవోబీ సరిహద్దులో రెక్కీ చేసి పోలీసులపై మందుపాతరలతో దాడి చేసింది. రిక్రూట్మెంట్ వెనుక అనుబంధ సంఘాలు? రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో నిరుద్యోగ యువతను ఉద్యమాల పేరుతో మావోయిస్టుపార్టీ వైపు మళ్లించేందుకు అనుబంధ సంఘాలు ప్రయత్నిస్తున్నా యని తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా గతంలో మావోయిస్టు పార్టీలో చేరేందుకు యత్నించిన 32 మందిని తెలంగాణ ఎస్ఐబీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చింది. వీరికి ఆంధ్రా ఒడిశా బార్డర్(ఏవోబీ) కమిటీ కారద్యర్శి హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ప్రోత్సాహం ఉందని బయటపడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన వ్యవహారంలో రామకృష్ణ యాక్షన్ ప్లానే అమలు చేశారని ని ఘా వ్యవస్థ గుర్తించింది. ఇలా 2 రాష్ట్రాల్లో ఎంతమందిని రిక్రూట్ చేశారు? వారిప్పుడు ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుబంధ సంఘాలను నియంత్రిస్తే గానీ రిక్రూట్‌మెంట్‌ను ఆపలేమని ఇరు రాష్ట్రాల పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మంగళవారం ఆరోపించారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని అనిశ్చితి నెలకొందన్నారు. చట్టబద్ధమైన, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధంగా నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తున్నారని విమర్శించారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ పదవీ కాలం ముగియనున్న తరుణంలో ప్రజలపై నిర్బంధాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గత ఐదేళ్లుగా అనుసరించిన నిర్బంధాన్ని తిరిగి కొనసాగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఈ నిర్బంధం వల్ల సమాజంలో హింస పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పాలనకు విరుద్దంగా రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా పరిపాలన ఉందని విమర్శించారు. ‘మా పిల్లలకు సంబంధం లేదు’ తమ పిల్లలకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన భవానీ, అన్నపూర్ణ, అనూషల తల్లిదండ్రులు రమణయ్య, లక్ష్మీనర్సమ్మలు అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పెద్ద కూతురు భవానీ టైలరింగ్ చేస్తుండగా, మిగతా ఇద్దరు అన్నపూర్ణ, అనూషలు మహిళా సంఘాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పిల్లలను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. -
కార్పొరేట్ శక్తులకు కాపలాగా కేసీఆర్
గద్వాల అర్బన్: కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు కాపలాగా ఉంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నారని విద్యా పరిరక్షణ కమిటీ జాతీయ కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతిస్తున్నారని విమర్శించారు. కళాశాలల విద్యను నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ మాఫియాకు అప్పజెప్పారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఉన్నత విద్య అందకుండా చేయాలని ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారని ఆరోపించారు. విద్య పరిరక్షణ కమిటీతో చర్చించకుండా ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్ రాఘవాచారితో పాటు ప్రభాకర్, టీవీవీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
హక్కులను కాలరాస్తున్నారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారంలోకి వచ్చాక పౌర హక్కులను కాలరాస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిర్బంధంపై ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కంటే పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పిన కేసీఆర్ అధికారంలో వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంత నిర్బంధం అవసరం లేదన్నారు. గతంలో ఎన్టీఆర్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు నిర్బంధాన్ని విధించి ప్రజల నుంచి తిరస్కారం పొందిన వారేనని గుర్తు చేశారు. సరిహద్దులు దాటి మరీ ఎన్కౌంటర్లు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ ఎన్కౌంటర్లు చేస్తుందని హరగోపాల్ విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారులపై 302 కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర నాయకుడు చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక భూమిక పోషించిందని, అలాంటి మిలియన్ మార్చ్ ఉత్సవాలను కూడా జరుపుకోకుండా నిర్బంధం విధించటం దేనికని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామిక పద్ధతిలో నడవకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పివోడబ్ల్యూ అధ్యక్షురాలు పి.సంధ్యా, సీసీఐ నేత సుధాకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కె.గోవర్ధన్, సీపీఎం నేత డీజీ నర్సింహారావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని గౌరవిస్తే హింస తగ్గుముఖం
హైదరాబాద్: పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించి సక్రమంగా అమలు చేసినప్పుడే హింస తగ్గుతుందని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. శుక్రవారం సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నిర్వహించిన చండ్రపుల్లారెడ్డి శతజయంతి ముగింపుసభలో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం పనికిరాదనేలా పాలకులు వ్యవహరిస్తున్నారని, హిందూ రాజ్యాన్ని స్థాపించాలనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. ‘విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం, అందుకేనా ఆనాడు మహాత్మాగాంధీ విదేశీ వస్తువులను బహిష్కరించాలని పోరాటం చేసింది’ అని ప్రశ్నించారు. సమానత్వం కోసం పుల్లారెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమైనదని కొనియాడారు. పుల్లారెడ్డి మార్గం ఆదర్శనీయమని, విప్లవజీవితంలో ఆయన సఫలీకృతుడయ్యారని సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పుల్లారెడ్డి ఉద్యమబాట పట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ తెలంగాణ కార్యదర్శి వెంకటేశ్వరరావు, మహారాష్ట్ర కార్యదర్శి అశోక్ గాయల్, ఏపీ కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోవర్ధన్, ఏఐకేఎంఎస్ అధ్యక్షుడు అచ్యుతరామారావు, ఏపీ అధ్యక్షుడు రాజారావు, పుల్లారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్ రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం పుల్లారెడ్డి జీవితచరిత్ర పుస్తకాన్ని బచ్చల రమేశ్ ఆవిష్కరించారు. -
అభివృద్ధి పేరుతో విధ్వంసం సరికాదు
సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ కేయూ క్యాంపస్ : అభివృద్ధి పేరుతో అటవీప్రాంతాల్లోని ఆదివాసీల జీవితాలను విధ్వంసం చేయడం సరికాదని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్ కళాశాల సెమినార్‌హాల్‌లో మానవహక్కుల నేత దివంగత డాక్టర్ కె.బాలగోపాల్ యాదిసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి–విధ్వంసం అనే అంశంపై ఆయన మాట్లాడారు. విధ్వంసం చేసే అభివృద్ధి ఎవరికోసమని ప్రశ్నించారు. అభివృద్ధి అనేది మానవీయంగా ఉండాలన్నారు. అభివృద్ధి పేరుతో భూములు లాక్కుంటూ హింసకు గురిచేయడం సరికాదన్నారు. పౌర హక్కుల సంఘాన్ని తాను, బాలగోపాల్, ఇతర సభ్యులతో కొనసాగించామని గుర్తుచేశారు. పౌరహక్కుల సంఘం ప్రశ్నించిన తీరును పలు ఉదాహరణతో వివరించారు. నక్సటైట్లను రాజ్యం హింసతో చంపినప్పుడు తమ సంఘం ప్రశ్నిస్తే.. నక్సలైట్ల హింసను కూడా ఎందుకు వ్యతిరేకించరని అప్పట్లో పౌరహక్కుల సంఘాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు.రెండు నక్సలైట్ల గ్రూపుల మధ్య గొడవలతో చంపుకున్నప్పుడు కూడా పౌరహక్కుల సంఘంలో తాము తర్జనభర్జన పడ్డామని, ఆ సమయంలో వీరు వినకుంటే మీపై వ్యాసాలు రాస్తామని నిర్మొహమాటంగా బాలగోపాల్ వారికి చెప్పారని వివరించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులతో నిర్బంధం కూడా బాలగోపాల్ ఎదుర్కొన్నారన్నారు. పౌరహక్కుల కోసం పనిచేసే డాక్టర్ రామనాథంను చంపినప్పుడు జిల్లాలోని పౌరుల నుంచి స్పందన రాలేదని వివరించారు. ఆ తర్వాత క్రమంలో మానహక్కుల వేదికను బాలగోపాల్ ఏర్పాటు చేశారన్నారు. తాను పౌరహక్కుల సంఘంలోనే ఉన్నానన్నారు. బాలగోపాల్ జీవితాంతం విలువలను పాటిస్తూ, సమాజంకోసం నిరంతరం పరితపించిన అరుదైన గొప్ప మానవతవాది అని కొనియాడారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బాదవత్ రాజు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎన్సీలకు దోచిపెట్టేందుకే గ్రీన్‌హంట్
-ప్రొఫెసర్ హరగోపాల్ న్యూశాయంపేట : ఆదివాసీల హక్కులను కాలరాసి మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు గ్రీన్‌హంట్ పేరిట ప్రభుత్వాలు ఆదివాసీల నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో మంగళవారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరిగోపాల్ మాట్లాడారు. ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీలను పోలీస్ బలగాలు అడవుల నుంచి బయటకు గెంటివేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో ఇలాంటి చర్యలు తగవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నష్టం జరుగుతోందని, ఆంధ్రా వాళ్లు తమ సంపదను కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతోనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అధికారంలోకి రాకముందు తమది నక్సల్స్ ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. నేడు ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై నిర్బంధాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల సమస్యల కోసం సభ పెట్టుకుంటే చివరికి న్యాయవ్యవస్థ జోక్యం తీసుకుని అనుమతి ఇచ్చాక కూడా, పోలీసు నిర్బంధాల మధ్య సభ నిర్వహించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మానవీయ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీఎఫ్ నాయకులు రవీంధ్రనాధ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి ఇంత నిర్బంధం ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్త మాట్లాడుతూ భారత దేశంలో హిందూ ముస్లింల మధ్య సమైక్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో విరసం నేత వరవరరావు, ఆచార్య జిఎన్ సాయిబాబా, టీడీఎఫ్ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, నాయకులు నారాయణరావు, చిక్కుడు ప్రభాకర్, కోట శ్రీనివాసరావు, రవీందర్రావు, నలమాస కృష్ణ, జనగాం కుమారస్వామి, బాసిత్, రమాదేవి, నల్లెల రాజయ్య పాల్గొన్నారు. సభలో చేసిన తీర్మానాలివే.. -ఆదివాసీలను మట్టు పెట్టెందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మూడవ దశ గ్రీన్‌హంట్ మారణకాండను వెంటనే నిలిపి వేయాలి -దేశ వ్యాప్తంగా దళిత మైనారిటీలపై ఫాసిస్టు దాడులను నిలిపివేయాలి. -ఖనిజ నిక్షేప ఒప్పందాలను రద్దుచేయాలి. -బహిరంగ సభకు వస్తుండగా నిర్బంధించిన ఆదివాసీలను విడుదల చేయాలి. -వేముల రోహిత్ హంతకులను శిక్షించాలి నిర్బంధం మధ్య బహిరంగ సభ.. అనేక నిర్బంధాల మద్య టీడీఎఫ్ బహిరంగ సభ జరిగింది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు మాత్రమే సభ నిర్వహించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు ఒంటరిగా రావాలని, ర్యాలీలు, నినాదాలు చేయవద్దని పోలీసులు కట్డడి చేశారు. సభను, హంటర్‌రోడ్ ప్రధాన రాహదారి వద్ద సభకు వచ్చే వారిని వీడియో ద్వారా చిత్రీకరించారు. బహిరంగసభలో ఏడుగురు ముఖ్య వ్యక్తులలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే మాట్లాడారు. ప్రధాన వక్త అయిన విరసం నేత వరవరరావు స్టేజీపై కాకుండా ప్రజల మధ్యనే ఉండాల్సి వచ్చింది. ఇంత నిర్బంధం విధించినా బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం గమనార్హం.