
హైదరాబాద్: తెలుగు నేలపై నిర్బంధం పెంచిన ప్రతీ పార్టీ ఓడిపోయిందని, ఎన్నికల్లో విజయాన్ని సాధిం చిన ఎన్టీఆర్, చంద్రబాబులు ప్రజాసంఘాలపై నిర్బంధం పెంచాకే భారీ ఓటమిని చవిచూశారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్ పార్టీ కూడా గుర్తించాలని ఆయన సూచించారు. ఉపా చట్టం రద్దు, ప్రజాసంఘాల నాయకురాళ్లు భవాని, అన్నపూర్ణ, అనూషల అక్రమ అరెస్టుపై చైతన్య మహిళా సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవాని, అన్నపూర్ణ, అనూషలపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉపా చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పీవోడబ్ల్యూ సంధ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ..ప్రభుత్వ విధానాలు ప్రశ్నిస్తున్న వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అణచివేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో చైతన్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి శిల్ప, అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, ప్రొఫెసర్ కాశీం, పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణ, బాధిత తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ, రమణయ్యలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment