మూలాల్లోకి వెళ్తే సక్సెస్‌ మీదే! | Prof Haragopal Exclusive Interview on Group-1 Exams in Telangana | Sakshi
Sakshi News home page

మూలాల్లోకి వెళ్తే సక్సెస్‌ మీదే!

Published Fri, May 6 2022 1:26 AM | Last Updated on Fri, May 6 2022 3:22 PM

Prof Haragopal Exclusive Interview on Group-1 Exams in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పుస్తకాలపై దృష్టికన్నా, సడలని ఆత్మ విశ్వాసమే అసలైన ఆయుధమని సామాజిక వేత్త, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ పరీక్షల సిలబస్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ చెప్పారు. పైపైన చదవకుండా, మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసిన వారే పరీక్షల్లో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. విస్తృత భావజాలంతో గ్రూప్‌–1 సిలబస్‌ను రూపొందించామని.. విశాల ఆలోచనా ధోరణితో అవగాహన చేసుకుంటే అభ్యర్థులు సునాయాసంగా గెలుపు బాట పట్టవచ్చని తెలిపా రు. గ్రూప్స్‌ పరీక్షల నేపథ్యంలో హరగోపాల్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. 

స్థానిక చరిత్రకే ప్రాధాన్యం 
తెలంగాణ ఏర్పాటు తర్వాత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విశాల దృక్పథంతో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశలోనే పరీక్ష సిలబస్‌ విభిన్నంగా ఉండాలని నేను చైర్మన్‌గా 18 మందితో ప్రభుత్వం కమిటీ వేసింది. అందులో కోదండరాం, చుక్కా రామయ్య సహా పలువురు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ నేపథ్యం. భౌగోళిక పరిస్థితులకు ప్రాధాన్యమిచ్చాం. ఈ అంశాల నుంచే 50 మార్కులకు పేపర్‌ ఉంటుంది. రాష్ట్ర పరిణామాలపై జనరల్‌ నాలెడ్జ్, ఆంగ్ల భాషా నైపుణ్యం (టెన్త్‌ స్టాండర్డ్స్‌)పై కనీస అవగాహన ఉండాలి. మేథ్స్‌ను కూడా సిలబస్‌లో జోడించాలనుకున్నాం. కానీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో చేయలేకపోయాం. 

ఇంటర్వ్యూ ఉంటేనే మేలు 
పాలనా సామర్థ్యం, ప్రజలతో డీల్‌ చేసే విధానం, వ్యక్తిత్వ వికాసం వంటివి ఇంటర్వ్యూ ద్వారానే తెలుస్తాయి. యూపీఎస్సీ కూడా ఇంటర్వ్యూకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇంటర్వ్యూ తీసేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా ఉండాలనే కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు తొలగించారు కాబట్టి రాతపరీక్షలోనే సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి. 

లోతుగా అధ్యయనం చేయాలి 
భారత రాజ్యాంగాన్ని లోతుల్లోకి వెళ్లి చదవాలి. ఉదాహరణకు ఆర్టికల్‌–3. నాటి దేశ పరిస్థితులను బట్టి దానిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దేశం సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని అప్పట్లో అంబేడ్కర్‌ ప్రతిపాదించారు. ఇలా లోతుగా తెలుసుకుంటేనే గ్రూప్స్‌ రాసే విద్యార్థులకు సమగ్ర అవగాహన ఉంటుంది. సులువుగా విజయం సాధిస్తారు. ఆదేశిక సూత్రాలను సూచించే పార్ట్‌–4 చాలా ముఖ్యం. ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనేది దీని నుంచే సమగ్రంగా తెలుసుకోవచ్చు. రాజ్యాంగం పార్ట్‌–3లో పౌరులకు స్వేచ్ఛ ఇస్తే.. పార్ట్‌–4లో సామాజిక న్యాయం ఉంటుంది.› ఈ రెండింటికీ మధ్య లింక్‌ను తాత్విక, సామాజిక కోణంలో అవగతం చేసుకున్న విద్యార్థి.. ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలడు. ఇలాంటివాటిని గైడ్‌ ద్వారా ఫాలో అవడం కష్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ గురించి మాత్రమే కాకుండా.. వాటి నేపథ్యం తెలుసుకుంటే మంచి మార్కులొస్తాయి. జనరల్‌ ఎస్సే విషయంలో సమకాలీన పరిస్థితులను ఎక్కువ అ«ధ్యయనం చేయాలి. నదీజలాలు, పర్యావరణ సమస్యలు వంటి తాజా పరిణామాలు, గత చరిత్ర తెలుసుకోవాలి.

ఆత్మ విశ్వాసమే అసలు ఆయుధం 
ఒక్కో అభ్యర్థి ఒక్కో రకమైన భావజాలంలో ఉంటారు. గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ముందుగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అదే అసలైన ఆయుధం. యూనివర్సిటీలు విద్యార్థులకు అందించాల్సింది ఇదే. ఈ మధ్య ప్రత్యేక కోచింగ్‌ సెంటర్లు పెడుతున్నారు. ఏపీ స్టడీ సర్కిల్, తెలంగాణ స్టడీ సర్కిళ్ల పేరుతో ప్రభుత్వాలే నడుపుతున్నాయి. అక్కడ చేయాల్సిందల్లా అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. ఇంగ్లిష్‌ భాష అంటే భయపడొద్దు. కనీస పరిజ్ఞానం పొందితే చాలు. గ్రూప్‌–1 అధికారికి భాష ప్రధానం కాదు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే శక్తి ఉండాలి. 

తెలిసినది కాదు.. అడిగింది రాయాలి.. 
పోటీ పరీక్షల్లో ఎప్పుడూ ప్రశ్నలను ట్విస్ట్‌ చేసి ఇస్తారు. చాలామంది ఈ విషయాన్ని సరిగా గమనించరు. మనకు తెలిసింది రాయాలనే ఉత్సాహం పరీక్షలో సరికాదు. పరీక్షలో అడిగింది రాయడమే ముఖ్యం. ప్రశ్నను రెండు మూడుసార్లు జాగ్రత్తగా చదవాలి. జవాబు రాసేప్పుడూ ప్రశ్నను మరోసారి చదవాలి. అప్పుడే సమాధానం సరిగా రాస్తున్నది లేనిది తెలుస్తుంది. అడిగింది రాసిన అభ్యర్థులు పాసవుతారు. యూపీఎస్సీలో గతంలో వచ్చిన పేపర్లు తెచ్చుకోవాలి. వాటిల్లోంచి కొన్ని ప్రశ్నలు ఎంపిక చేసుకోవాలి. పుస్తకాల నుంచి సమాధానం సంగ్రహించాలి. తర్వాత పుస్తకాలు చూడకుండా సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. వాటిని నిపుణులకు చూపించి ఎలా ఉందో, ఇంకెలా రాయోలో తెలుసుకోవాలి. దీనివల్ల మంచి మార్కులు వచ్చే వీలుంది.   

కోచింగ్‌ సెంటర్లది వ్యాపారమే.. 
 చాలా కోచింగ్‌ సెంటర్లు వ్యాపార ధోరణిలో వెళ్తున్నాయి. స్టడీ మెటీరియల్స్‌ లక్షల్లో అమ్ముడుపోతాయి. కానీ వాటిని ఏ విధమైన నైపుణ్యం లేని వ్యక్తులతో రూపొందిస్తున్నారు. ఎలాంటి అవగాహన లేని మెటీరియల్స్‌ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. తెలంగాణపై జయశంకర్, అడపా సత్య
నారాయణ వంటివారు రాసిన పుస్తకాలు చదవాలి.

తెలుగు అకాడమీ డీలా పడింది 
గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకం, మెటీరియల్‌ను కొనొద్దు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెటీరియల్‌ అందించే క్రమంలో ఒక్కోసారి తెలుగు అకాడమీ కూడా తప్పులు చేస్తోంది. ఉదాహరణకు ‘అనార్కిజం’అనే పదాన్ని ‘అరాచకవాదం’అని తర్జుమా చేశారు. అనార్కిజం అంటే పరిమితుల్లేని స్వేచ్ఛ. ఇదో ఫిలాసఫీ. సబ్జెక్టుపై సమగ్ర అవగాహన ఉంటేనే ఇలాంటివన్నీ గుర్తించడం సాధ్యమవుతుంది. గైడ్లు తయారుచేసే వాళ్లకు ఇవి తెలియవు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో తెలుగు అకాడమీ ముందుండాలి. ఓపెన్‌ యూనివర్సిటీ రంగంలోకి దిగాలి. అనుభవజ్ఞులతో స్టడీ మెటీరియల్‌ అందించాలి. అకాడమీ గందరగోళంలో ఉంది. పుస్తకాలు ప్రింట్‌ చేయడం లేదు. కీలక సమయంలో డీలా పడింది. ఇప్పటికైనా విద్యార్థులకు చేయూతగా ఉండాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement