- సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్
అభివృద్ధి పేరుతో విధ్వంసం సరికాదు
Published Sat, Oct 8 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
కేయూ క్యాంపస్ : అభివృద్ధి పేరుతో అటవీప్రాంతాల్లోని ఆదివాసీల జీవితాలను విధ్వంసం చేయడం సరికాదని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్ కళాశాల సెమినార్‌హాల్‌లో మానవహక్కుల నేత దివంగత డాక్టర్ కె.బాలగోపాల్ యాదిసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి–విధ్వంసం అనే అంశంపై ఆయన మాట్లాడారు. విధ్వంసం చేసే అభివృద్ధి ఎవరికోసమని ప్రశ్నించారు. అభివృద్ధి అనేది మానవీయంగా ఉండాలన్నారు. అభివృద్ధి పేరుతో భూములు లాక్కుంటూ హింసకు గురిచేయడం సరికాదన్నారు. పౌర హక్కుల సంఘాన్ని తాను, బాలగోపాల్, ఇతర సభ్యులతో కొనసాగించామని గుర్తుచేశారు.
పౌరహక్కుల సంఘం ప్రశ్నించిన తీరును పలు ఉదాహరణతో వివరించారు. నక్సటైట్లను రాజ్యం హింసతో చంపినప్పుడు తమ సంఘం ప్రశ్నిస్తే.. నక్సలైట్ల హింసను కూడా ఎందుకు వ్యతిరేకించరని అప్పట్లో పౌరహక్కుల సంఘాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు.రెండు నక్సలైట్ల గ్రూపుల మధ్య గొడవలతో చంపుకున్నప్పుడు కూడా పౌరహక్కుల సంఘంలో తాము తర్జనభర్జన పడ్డామని, ఆ సమయంలో వీరు వినకుంటే మీపై వ్యాసాలు రాస్తామని నిర్మొహమాటంగా బాలగోపాల్ వారికి చెప్పారని వివరించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులతో నిర్బంధం కూడా బాలగోపాల్ ఎదుర్కొన్నారన్నారు. పౌరహక్కుల కోసం పనిచేసే డాక్టర్ రామనాథంను చంపినప్పుడు జిల్లాలోని పౌరుల నుంచి స్పందన రాలేదని వివరించారు. ఆ తర్వాత క్రమంలో మానహక్కుల వేదికను బాలగోపాల్ ఏర్పాటు చేశారన్నారు. తాను పౌరహక్కుల సంఘంలోనే ఉన్నానన్నారు. బాలగోపాల్ జీవితాంతం విలువలను పాటిస్తూ, సమాజంకోసం నిరంతరం పరితపించిన అరుదైన గొప్ప మానవతవాది అని కొనియాడారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బాదవత్ రాజు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement