పాస్‌వర్డ్‌ పరేషాన్‌! | Fraud In Degree Admissions Kakatiya University | Sakshi
Sakshi News home page

పాస్‌వర్డ్‌ పరేషాన్‌!

Published Mon, Jun 17 2019 8:27 AM | Last Updated on Mon, Jun 17 2019 8:27 AM

Fraud In Degree Admissions Kakatiya University - Sakshi

కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి డిగ్రీలో చేరేందుకు తల్లిదండ్రులతో కలిసి ఒక ప్రైవేట్‌ కళాశాలకు మొదటి దశలో సర్టిఫికెట్లు అప్పగించారు. సదరు కళాశాలకు చెందిన వారు తమ కళాశాలకు సంబంధించిన ఫోన్‌ నంబర్, దానికి వచ్చే పాస్‌వర్డ్‌  ఆధారంగా మొదటి దశలో నమోదు చేసి కేవలం తమ కళాశాలలోనే ఆప్షన్‌ ఇవ్వగా, అందులోనే సీటు వచ్చింది. ఇప్పుడు విద్యార్థి స్నేహితులకు వేరే కళాశాలల్లో సీటు రాగా మారాలని ఆలోచన ఉంది. మారుదామంటే కళాశాల ఫోన్‌ నంబర్‌ ఇచ్చి ప్రవేశాలు నమోదు చేశారు. ఇప్పుడు రెండో దశలో మారాలంటే ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి. ఈ విషయమై కళాశాలల వారిని అడుగగా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు’ ఇది శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఇలాగే కళాశాల నంబర్లు ఇచ్చి విద్యుర్థులు ఎటూ వెళ్లకుండా చేస్తున్నారు. – 

శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ మొదటి దశలో పలు ప్రైవేట్‌ కళాశాలలు ఒడిగట్టిన అక్రమాలకు విద్యార్థులు బలవుతున్నారు. వివిధ అఫర్ల పేరుతో నమ్మబలికి మొదటి దశలో పలు కళాశాలలకు సంబంధించిన వ్యక్తులవే ఫోన్‌ నంబర్లు ఇచ్చి వాటికి వచ్చిన ఓటీపీలతోనే ప్రవేశాల నమోదు చేశారు. తమ కళాశాలల్లోనే సీట్లు వచ్చేలా అప్షన్లు ఇచ్చారు. ఫలితంగా వారుకోరుకున్నట్టే వారి కళాశాలల్లోనే సీట్లు పొందారు. కానీ మొదటి దశ సీట్ల కేటాయింపు పక్రియ ముగిసి రెండో దశ కౌన్సిలింగ్‌కు నేటి(సోమవారం) వరకు అవకాశముంది. రెండో దశలో కళాశాల మార్చుకుందామనే ఆలోచన ఉన్న విద్యార్థులకు పలు ప్రైవేట్‌ కళాశాల వారి నంబర్లే ఇవ్వడంతో మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. డిగ్రీ ప్రవేశాల నమోదులో ఫోన్‌ నంబరే కీలకం కావడంతో కళాశాల మార్చేందుకు ఆప్షన్లు పెట్టుకుందామనే వారికి పలు ప్రైవేట్‌ కళాశాలలు ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం లేదు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పలు కళాశాలలు ఇచ్చిన ఆఫర్లకు ఆకర్షితులై వారి పిల్లలకు కూడా తెలియకుండా వారి ప్రవేశాలు ప్రైవేట్‌ కళాశాలల్లో తీసుకున్నారు. వారికి మారుదామనే ఆలోచన ఉన్నా ప్రవేశాల సమయంలో కళాశాలల నంబర్లు ఇవ్వడం, మారడం ఎందుకనే తల్లిదండ్రుల బలవంతంతో అదే కళాశాలల్లో మగ్గుతున్నారు.  

బహుమానాలు.. బంఫర్‌ ఆఫర్లు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం రెండో దశ కొనసాగుతుంది. మొదటి దశ సీట్లు కేటాయించగా నేటితో రెండోదశ నమోదు, వెబ్‌ఆప్షన్లు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ముగుస్తుంది. ఇది ఇలా ఉండగా తమ కళాశాలలో సీట్లు నింపుకునేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకరు ప్రవేశానికి మొబైల్‌ ఫోన్‌ ఉచితంగా ఇవ్వడం, మరో కళాశాల ఏకంగా ల్యాప్‌టాప్‌ ఇస్తామని, మరికొన్ని కళాశాలలు  రవాణా ఫీజు, పరీక్ష ఫీజుతోపాటు అన్ని ఫీజులు ఉచితమేనని, ఇంకొన్ని కళాశాలలు ఒక అడుగు ముందుకు వేసి అన్ని ఫీజులు ఉచితంతోపాటు తిరిగి విద్యార్థులకు నగదు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కొన్ని కళాశాలల యాజమాన్యాలు డిగ్రీ ప్రవేశాల పక్రియలో తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీతో దిగజారుడుతనం ప్రదర్శిస్తున్నాయి. ఎలాగో సీట్లు నింపుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొడుదామనే ఆలోచనతో ప్రవేశాలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు తమ లెక్చరర్లలో కాన్వాసింగ్‌ చేపించి అడ్మిషన్‌కు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా తల్లిదండ్రలు మాత్రం విద్యా నాణ్యత ప్రమాణాలు పాటించే కళాశాలల్లోనే విద్యార్థులను చేర్చాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. ప్రైవేట్‌ కళాశాలల అక్రమాల విషయంపై శాతవాహన రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యూ.ఉమేశ్‌కుమార్‌ను సంప్రదించగా ప్రైవేట్‌ కళాశాలలు ప్రవేశాల విషయంలో ప్రలోభాలు, ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement