ఎంఎన్సీలకు దోచిపెట్టేందుకే గ్రీన్హంట్
-ప్రొఫెసర్ హరగోపాల్
న్యూశాయంపేట : ఆదివాసీల హక్కులను కాలరాసి మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు గ్రీన్‌హంట్ పేరిట ప్రభుత్వాలు ఆదివాసీల నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.
హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో మంగళవారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరిగోపాల్ మాట్లాడారు. ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీలను పోలీస్ బలగాలు అడవుల నుంచి బయటకు గెంటివేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో ఇలాంటి చర్యలు తగవన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నష్టం జరుగుతోందని, ఆంధ్రా వాళ్లు తమ సంపదను కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతోనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అధికారంలోకి రాకముందు తమది నక్సల్స్ ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. నేడు ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై నిర్బంధాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల సమస్యల కోసం సభ పెట్టుకుంటే చివరికి న్యాయవ్యవస్థ జోక్యం తీసుకుని అనుమతి ఇచ్చాక కూడా, పోలీసు నిర్బంధాల మధ్య సభ నిర్వహించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మానవీయ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీఎఫ్ నాయకులు రవీంధ్రనాధ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి ఇంత నిర్బంధం ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్త మాట్లాడుతూ భారత దేశంలో హిందూ ముస్లింల మధ్య సమైక్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో విరసం నేత వరవరరావు, ఆచార్య జిఎన్ సాయిబాబా, టీడీఎఫ్ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, నాయకులు నారాయణరావు, చిక్కుడు ప్రభాకర్, కోట శ్రీనివాసరావు, రవీందర్‌రావు, నలమాస కృష్ణ, జనగాం కుమారస్వామి, బాసిత్, రమాదేవి, నల్లెల రాజయ్య పాల్గొన్నారు.
సభలో చేసిన తీర్మానాలివే..
-ఆదివాసీలను మట్టు పెట్టెందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మూడవ దశ గ్రీన్‌హంట్ మారణకాండను వెంటనే నిలిపి వేయాలి
-దేశ వ్యాప్తంగా దళిత మైనారిటీలపై ఫాసిస్టు దాడులను నిలిపివేయాలి.
-ఖనిజ నిక్షేప ఒప్పందాలను రద్దుచేయాలి.
-బహిరంగ సభకు వస్తుండగా నిర్బంధించిన ఆదివాసీలను విడుదల చేయాలి.
-వేముల రోహిత్ హంతకులను శిక్షించాలి
నిర్బంధం మధ్య బహిరంగ సభ..
అనేక నిర్బంధాల మద్య టీడీఎఫ్ బహిరంగ సభ జరిగింది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు మాత్రమే సభ నిర్వహించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు ఒంటరిగా రావాలని, ర్యాలీలు, నినాదాలు చేయవద్దని పోలీసులు కట్డడి చేశారు. సభను, హంటర్‌రోడ్ ప్రధాన రాహదారి వద్ద సభకు వచ్చే వారిని వీడియో ద్వారా చిత్రీకరించారు. బహిరంగసభలో ఏడుగురు ముఖ్య వ్యక్తులలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే మాట్లాడారు. ప్రధాన వక్త అయిన విరసం నేత వరవరరావు స్టేజీపై కాకుండా ప్రజల మధ్యనే ఉండాల్సి వచ్చింది. ఇంత నిర్బంధం విధించినా బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం గమనార్హం.