సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్ సంస్థ డాటా కుంభకోణం వ్యవహారంపై తెలంగాణ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. మరోవైపు ఐటీగ్రిడ్ తస్కరించిన సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎక్కువయ్యాయి. రెండ్రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న ప్రకటనలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే క్రమం లో తమ తప్పును కప్పి పుచ్చుకోవడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు, లోకేశ్ చేసిన మరో ప్రయత్నంపై కూడా తెలు గు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. (ఇక్కడ మేము క్షేమమే బాబూ..)
డాటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రెండ్రోజులుగా చంద్రబాబు, లోకేశ్ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం తెలంగా ణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. #CashForTweet అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమం ట్వీట్‌ల ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేశ్ ఆదేశాల మేరకు ఎదురుదాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ ట్వీట్ల వెనుక చంద్రబాబు, లోకేశ్ హస్తమున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. (‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం)
వివిధ రాష్ట్రాల నుంచి ట్వీట్లు
ఆంధ్ర, తెలంగాణలతో సంబంధంలేని ట్విట్టర్ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ల సారాంశం అంతా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపేలా ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి. ముంబాయికి చెందిన సంజయ్ బఫ్నా అనే వ్యక్తి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ ‘వాళ్లు విలువైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయడంతోపాటు ఐటీ సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసే చర్యలకు పాల్పడినందుకు సిగ్గుపడాలి’అని ట్వీట్ చేశాడు. ఇదే రీతిలో పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ట్వీట్ చేశారు. ‘మా నాయకుడితో పోరాడ లేకే.. మా అభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’అని ముంబాయి చెందిన సంతోష్ శుక్లా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. (అదో ‘బ్లాక్‌మెయిల్’ యాప్)
బాలీవుడ్ చౌక్ పేరిట ‘మా ఆస్తులను దొంగిలించారు. మా నీళ్లను దొంగిలించారు. ఇప్పుడు మా డాటాను దొంగిలిస్తున్నారా? టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిగ్గు పడాలి’అనే అర్థం వచ్చేలా ట్వీట్ రాగా, మరికొంత మంది కూడా ఇదే అర్థం వచ్చేలా ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్న చంద్రబాబు, లోకేశ్ తాజాగా ‘క్యాష్ ఫర్ ట్వీట్’కు తెరలేపినట్లు టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. డబ్బులు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న తీరుపై సైబర్ క్రైం విభాగంతో పాటు, సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే ‘ఓటుకు నోటు’, ‘డాటా కుంభకోణం’వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, లోకేశ్ ‘క్యాష్ ఫర్ ట్వీట్’వివాదానికీ కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment