ముఖం చూసి పట్టిస్తుంది! | Telangana Police set to get Facial Recognition System | Sakshi
Sakshi News home page

ముఖం చూసి పట్టిస్తుంది!

Published Fri, Aug 3 2018 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

Telangana Police set to get Facial Recognition System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖ మరో టెక్నాలజీ ఆయుధాన్ని అందిపుచ్చుకుంది. మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్తులు, పాతనేరస్తులు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, అదృశ్యమైన చిన్నారులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు ఈ యాప్‌ ఎంతో ఉపకరించనుందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో గురువారం ఈ వ్యవస్థను ఆయన ఆవిష్కరించారు. ఈ సర్వీస్‌ను టీఎస్‌కాప్‌ యాప్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు.  

30 సెకన్లలో సర్వర్‌ నుంచి..
ఈ యాప్‌లో ఇప్పటి వరకు లక్ష మంది పాతనేరస్తుల ఫొటోలు, అదృశ్యమైన వారి ఫొటోలు, దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిందితుల ఫొటోలను సైతం చెక్‌ చేసుకునే సౌకర్యం కల్పించారు.

తనిఖీల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తి తారసపడితే సంబంధిత వ్యక్తి ఫొటోను తీసుకొని యాప్‌లో సర్వర్‌కు కనెక్ట్‌ చేస్తే 30 సెకన్లలో సంబంధిత వ్యక్తి పాతనేరస్తుడైనా, అదృశ్యమైన వ్యక్తి అయినా తెలిసిపోతుందని డీజీపీ తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లోని నేరస్తుల ఫొటోలు, దర్యాప్తు సంస్థల మోస్ట్‌వాంటెడ్, అరెస్ట్‌చేసిన వారి ఫొటోలు అప్‌డేట్‌ అవుతాయని, దీంతో ఈ యాప్‌ టీఎస్‌కాప్‌లోకి అప్‌డేట్‌ ఫొటోలను చేరవేస్తుందన్నారు.  

ఎవిడెన్స్‌ యాక్ట్‌ కిందకు రాదు..
ఈ సాంకేతికత ద్వారా గుర్తించిన నిందితుల చార్జిషీట్‌ దాఖలులో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ను ఆధారాలుగా పేర్కొనలేమని డీజీపీ పేర్కొన్నారు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టం ప్రకారం దీన్ని ఆధారం కింద పరిగణించలేమన్నారు.  

కికీ చాలెంజ్‌పై వార్నింగ్‌..  
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కికీ చాలెంజ్‌పై డీజీపీ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇలాంటి ప్రాణాంతక చాలెం జ్‌ను ఎవరు స్వీకరించినా కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ధోరణి వల్ల ఇతరుల ప్రాణాలకు హాని ఉందని, చేసే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement