ఖమ్మం : జిల్లా కాంగ్రెస్ సారథి ఎంపికపై కొనసాగుతున్న లొల్లి ఢిల్లీకి చేరింది. ఏ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తే ఏ తంటా వస్తుందోనని తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ చేతులెత్తేయండంతో ఈ అంశం హస్తినాకు చేరింది. డీసీసీ అధ్యక్షుడెవరో తేల్చేందుకు ఈనెల 15న ఢిల్లీ పెద్దలు ముహూర్తం పెట్టారు. అక్కడి నుంచి టీపీసీసీకి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఢిల్లీకి పయనం కావాలని జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ నాయకులు వర్తమానం పంపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదనే నెపంతో అప్పటి డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఖాళీ అయిన డీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించకుండా కార్యాలయ ఇన్‌చార్జీల పేరుతో ఐదుగురు సభ్యులను నియమించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎవరో ఒకరిని ఎంపిక చేసి కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులు భావించారు. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్న నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించుకునేందుకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పావులు కదిపారు. తమ వర్గీయుడికే పదవి ఇవ్వాలని పట్టుపట్టడంతో ఈ వ్యవహారాన్ని టీపీసీసీ ఏటూ తేల్చలేకపోయింది.
ఈ వ్యవహారాన్ని ఏఐసీసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో 15న పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని జిల్లా నాయకులకు అధిష్టానం కరుబు పంపింది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జానారెడ్డి, జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ కుసుమ కుమార్ పాల్గొనే ఈ భేటీకి ఖమ్మం, పాలేరు, మధిర ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవి ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రేణుకాచౌదరి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, షోకాజ్ నోటీసులు ఇప్పించుకోవడం జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఈనెల 15న హస్తినలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ జిల్లా సారథి ఎంపిక సాఫీగా జరుగుతుం దా..? అనే చర్చ జిల్లా కాంగ్రెస్ శ్రే ణుల్లో సాగుతోంది.
ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ లొల్లి
Published Sun, Oct 12 2014 2:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement