సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె.. కొన్ని రోజులుగా హాట్ టాపిక్. ఆర్టీసీ చరిత్రలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 50 రోజులకు చేరుకుని ఇంకా ‘నాట్ ఔట్’ అంటోంది. 49,300 మంది కార్మికులతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో పార్లమెంట్‌లో కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కొలిక్కి వచ్చినట్టే వచ్చి ముగింపు దొరక్క ఇంకా కొన‘సాగుతోంది’. సకల జనుల సమ్మె తర్వాత తెలంగాణలో సంచలనానికి కేంద్రబిందువు అయింది. ఇప్పుడు బంతి ముఖ్యమంత్రి కోర్టులో ఉంది. ఆయన నిర్ణయం కోసం యావత్తు రాష్ట్రం ఎదురుచూస్తోంది. వేతన సవరణ కాలపరిమితి ముగిసిన తర్వాత, తదుపరి కొత్త వేతనాల కోసం కార్మిక సంఘాలు ప్రభుత్వానికి నివేదించడం, కాలయాపన చేస్తే సమ్మె పేరుతో హెచ్చరించటం సాధారణమే. కానీ ఈసారి పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇందుకు ‘దసరా’ ముహూర్తం మూల కారణమైంది. రోజురోజుకు ఉధృతమవుతూ కార్మికులు పట్టుదలతో ముందుకు సాగినా, అనూహ్య పరిణామాలతో కార్మిక సంఘాల జేఏసీ పట్టు సడలించింది.
జేఏసీ నోట సమ్మె విరమణ మాట
ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ తొలుత తెగేసి చెప్పింది. దీనికి కార్మిక లోకం బాసటగా నిలిచింది. అందుకే మూడు పర్యాయాలు విధుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినా, కార్మికులు మెట్టు దిగలేదు. సకల జనుల సమ్మె సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులు 62 రోజుల పాటు నిర్వహించిన సమ్మె ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో అతిపెద్దదిగా చరిత్ర సృష్టించింది. దాన్ని మించి తమ సమ్మె సాగుతుందని ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మిక నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. కానీ. అనూహ్యంగా ఈ కేసు కార్మిక శాఖ పరిధిలోకి రావటంతో సమ్మె విరమణకు జేఏసీ మొగ్గు చూపాల్సి వచ్చింది. సమ్మె చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా అని తేల్చాల్సింది కార్మిక న్యాయస్థానమే అని హైకోర్టు ఐదు రోజుల క్రితం తేల్చి చెప్పింది. దీంతో కేసు హైకోర్టు నుంచి కార్మిక శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది తేలే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో కార్మికుల్లో పునరాలోచన మొదలైంది. అంతకాలం సమ్మె చేస్తూ పోతే, కుటుంబ పోషణ ఎలా అన్న సంశయం రావడంతో సమ్మె విషయంలో జేఏసీపై ఒత్తిడి పెరిగింది. దీంతో విరమణ మాటను జేఏసీ బయటపెట్టింది.
30 మంది మృత్యువాత
సమ్మె మొదలైన తర్వాత దాదాపు 30 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇందులో నలుగురు ఆత్మహత్యలు చేసుకోగా, మిగిలిన వారు గుండెపోటుతో మరణించారు. సమ్మెతో బస్సులు సరిగా తిరగక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా, ఆర్టీసీ పరిరక్షణ పేరుతో కార్మికులు చేస్తున్న ఆందోళనలకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలూ మద్దతు తెలిపారు. కానీ, రెండు నెలలుగా జీతాలు అందక, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన కార్మికులు, తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉంటుందో లేదోనన్న వ్యధకు లోనయ్యారు. కార్మికులు గుండెపోటుతో చనిపోవటానికి ఈ ఆందోళనే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలా చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. వారికి ఆర్థిక సాయం చేయడానికంటూ కొంతమంది విరాళాల సేకరణ కూడా ప్రారంభించారు.
ప్రైవేటుకు బాటలు
టీఎస్‌ఆర్టీసీలో అనూహ్య పరిణామం. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ ప్రపంచంలోనే ఉన్నత రవాణా సంస్థగా వెలుగొందింది. ఇందుకు గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి విడిపడిన తెలంగాణ ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటుకు చోటు దక్కబోతోంది. సగం ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చే ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో తొలిసారి ప్రైవేటు స్టేజీ క్యారియర్ పర్మిట్లతో బస్సులు తిరిగేందుకు రంగం సిద్ధమైంది.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె రికార్డు
Published Sun, Nov 24 2019 8:44 AM | Last Updated on Sun, Nov 24 2019 1:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment