సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని, కార్మికులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తాము ఖండిస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. మంగళవారం జేఏసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చర్చల ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారం చేసేది కాదు. 31శాతం కేంద్ర వాటా ఉంది. సంస్థను మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఎలాంటి మార్పు చేయలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. చట్టం ద్వారా కార్మికులకు రక్షణ ఉంటుంది. ఎవరూ భయపడవద్దు. ఏ ఒక్క కార్మికుడు జాయిన్ అవ్వడం లేదు. జాయిన్ అయిన వారు వెనక్కి వస్తున్నారు’ అని అన్నారు.
భైన్సాలో తాత్కాలిక ఉద్యోగులు డీఎంపై దాడి చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. ఇంతమంది కార్మికులు చనిపోతే ప్రభుత్వం తరఫున కనీసం సానుభూతి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తాము ఈ ఘటనను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి అనుచరుడు ఒకరు సిబ్బందిని తీసుకొని వెళ్ళి డిపో వద్ద దింపడం సిగ్గు చేటని విమర్శించారు. సమ్మెకు మద్దతుగా 7న పెన్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడుతామని, చలో ట్యాంక్ బండ్ విజయవంతం చేయమని కొరతామని జేఏసీ నేతలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment