‘తెలంగాణ’ సిరీస్ ఏమిటి? | telangana series, does it tg or not? | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’ సిరీస్ ఏమిటి?

Published Sun, May 25 2014 1:16 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM

telangana series, does it tg or not?

వాహనాలకు ‘టీజీ’ కేటాయిస్తారా..  మారుతుందా?
 
సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించాక వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి సిరీస్‌ల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవటం గందరగోళానికి దారితీస్తోంది. అపాయింటెడ్ డే (జూన్ 2)కు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రవాణా శాఖకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై పలుమార్లు వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో అధికారులు చేతులెత్తేశారు. జూన్ రెండు నుంచి అధికారికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి దేనికవి పాలన ప్రారంభిస్తాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు  రాష్ట్రాల పరిధిలోనే జరుగుతాయి.
 
  ప్రస్తుతం ఉన్న ‘ఏపీ’ సిరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణకు ‘టీజీ’ సిరీస్‌ను కేటాయించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ సిరీస్ విషయంలో ఎలాంటి గందరగోళం లేకున్నా తెలంగాణకు సమస్యవచ్చిపడింది. అసలు టీజీ సిరీస్ ఉంటుందా, మరేదైనా కేటాయిస్తారా అన్న అనుమానాలూ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల పేర్ల ఆధారంగా పరి శీలిస్తే తెలంగాణకు టీజీ సిరీసే ఉంటుందని అధికారులు అంచనా వేసుకోవటం మినహా కేంద్రం నుంచి స్పష్టత రాలేదు.
 
  టీజీ సిరీస్‌ను కేటాయించినా... జిల్లాల వారీగా ఏయే సంఖ్య ఉంటుందో కూడా తేలాల్సి ఉంది. ఏపీ సిరీస్‌లో ఆయా జిల్లాల ఆంగ్ల అక్షరక్రమం ప్రకారం నంబర్లను కేటాయించారు (ఉదా... ఖైరతాబాద్ 09, మెహిదీపట్నం 13, వరంగల్‌కు 36). తెలంగాణకు కొత్త సిరీస్‌లో భాగంగా అంకెలు మారతాయా, పాత అంకెలనే కొనసాగించాల్సి ఉంటుందా అన్నదీ తేలాల్సి ఉంది. అధికారులు మాత్రం ఆదిలాబాద్‌కు టీజీ 01తో ప్రారంభించి నంబర్లను ఉజ్జాయింపుగా సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం పది ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. వీటికి ఏడు నంబర్లను కేటాయించారు. ఈలెక్కన టీజీ 01 నుంచి టీజీ-15 వరకు నంబర్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ కేంద్రం ఆదేశాలిస్తేగాని ఇందులో స్పష్టత రాదు. ఏపీ సిరీస్‌లో తెలంగాణ జిల్లాలకు ఉన్న నంబర్లనే కొనసాగించాలని పేర్కొంటే మాత్రం టీజీ సిరీస్‌తో ఆ పాత నంబర్లే కొనసాగుతాయి.
  తెలంగాణకు కొత్త నంబర్లు కేటాయిస్తే.. అందులోనూ మరో అయోమయం ఉండబోతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను విభజించి 24కు పెంచాలని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ ప్రక్రియ జరిగితే మళ్లీ నంబర్లలో తేడాలొస్తాయి.
 
  ఇక ఏపీ సిరీస్‌తో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాత వాహనాల విషయం మరో చిక్కు ప్రశ్న. తెలంగాణలోని పాత వాహనాలన్నింటిని కూడా కొత్త సిరీస్‌లోకి మార్చాల్సి ఉంటుందా... లేదా అవి అలాగే ఏపీ సిరీస్‌తోనే కొనసాగుతాయా అన్నది తేలాల్సి ఉంది.
 
  లెసైన్సుదారులకు అందజేస్తున్న కార్డుల విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. ఆ కార్డులపై రాష్ట్ర అధికారిక చిహ్నం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నాన్ని ముద్రిస్తున్నారు. తె లంగాణ రాష్ట్రంలో కొత్త చిహ్నాన్ని ముద్రించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణకు అధికారిక చిహ్నమంటూ ఏదీ సిద్ధం కాలేదు. జూన్ రెండు నుంచి జారీ చేసే కార్డులపై ఏ చిహ్నం ముద్రించాలన్న అంశంపై గందరగోళం నెలకొంది.
 
 మరో పది రోజుల్లో అధికారికంగా తెలంగాణ ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో ఇన్ని అంశాలకు స్పష్టత రాకపోవటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే ఢిల్లీని సంప్రదించినా ఫలితం రాకపోవటంతో వేచిచూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించి ఎలాంటి ముందస్తు ఏర్పాట్ల జోలికి వెళ్లటం లేదు. మరో నాలుగైదు రోజుల తర్వాత కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
 
 ఫ్యాన్సీ నంబర్లకు నెలాఖరువరకు గడువు...
 
 తెలంగాణ జిల్లాల్లో ముందస్తుగా వాహనాల నంబర్లను రిజర్వ్ చేసుకున్నవారు ఈనెలాఖరులోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే ఆదేశాల మేరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ సిరీస్, నంబర్లు మారే అవకాశం ఉన్నందున పాత సిరీస్ కేటాయింపు సాధ్యం కాదని పేర్కొంటున్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ నంబరు రిజర్వు చేసుకున్నాక పక్షం రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అపాయింటెడ్ డేకు పది రోజుల గడువు మాత్రమే ఉన్నందున, ఆ పక్షం రోజుల నిబంధన అమలు సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకోని వారికి ... ఇప్పటికే చెల్లించిన ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తిరిగి చెల్లించమని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement