మేము మునగాలా..! | Telangana state government 37 villages People Discomfort new state | Sakshi
Sakshi News home page

మేము మునగాలా..!

Published Mon, Jun 30 2014 3:21 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

మేము మునగాలా..! - Sakshi

మేము మునగాలా..!

‘స్థానికత’ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనావిధానం..మునగాల పరగణావాసుల్లో ఆందోళన రేపుతోంది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారినే స్థానికులుగా పేర్కొనాలన్న సూత్రపాయ నిర్ణయంతో తమ భవిష్యత్ ఏమిటన్న ఆలోచనలో పడ్డారు. 1956 తర్వాతే కృష్ణా జిల్లా నుంచి మునగాల, లింగగిరి పాత పరగణాలు జిల్లాలో విలీనం కావడమే ఇందుకు కారణం. 1956కు ముందు ప్రాతిపదికన అధికారిక నిర్ణయం వెలువడితే పరగణా పరిధిలోని 37 గ్రామాల ప్రజలు స్థానికేతరులుగా మారే అవకాశం ఉంది.
 
 సాక్షిప్రతినిధి, నల్లగొండ  :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘స్థానికత’ అంశంపై తీసుకునే నిర్ణయం కోదాడ నియోజకవర్గ పరిధిలోని 37 గ్రామాల ప్రజలకు ఇబ్బందికరంగా మారే వీలుంది. 1956 సంవత్సరం కంటే ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలనే స్థానికులుగా గుర్తించి ఫీజు రీయింబర్స్‌మెంట్  వర్తింపజేయాలన్న సూత్రప్రాయ నిర్ణయం అమల్లోకి రాకముందే పాత మునగాల పరగణా గురించి ఆలోచించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. స్థానికత వ్యవహారం కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే పరిమితం కాదని, మున్ముందు ఉద్యోగ అవకాశాల విషయంలోనూ ఇదే వర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలోని తాము స్థానికేతరులం కావాల్సి వస్తుందన్న ఆందోళన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం 1956వ సంవత్సరాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే ఈ గ్రామాల ప్రజలు పూర్తిగా స్థానికేతరులు అయిపోయే ముప్పు ఉంది.
 
 ఇదీ ... చరిత్ర
 మునగాల పర గణాకు సంబంధిచిన చరిత్రలోకి వెళితే... నడిగూడెం, కోదాడ, మునగాల మండలాల పరిధిలో అప్పటి మునగాల పరగణా విస్తరించి ఉంది. ఈ మండలాల పరిధిలోని 37గ్రామాలు 17వ శతాబ్దం వరకూ నిజాం పరిపాలనలో అంతర్భాగంగానే ఉన్నాయి. కర్ణాటక నవాబుకు, నిజాం ప్రభువుకు మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటీష్ సేనలు నిజాం తరఫున పోరాడాయి. ఈ యుద్ధంలో విజయం సాధించిన నిజాం ప్రభువు బ్రిటీష్ వారికి నజరానాగా లింగగిరి, మునగాల పరగణాలను 1766లో బ్రిటీష్ ఆధీనంలోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆనాటినుంచి బ్రిటీష్ వారు మునగాల పరగణాకు ఒక జమీందారును నియమించి పాలన కొనసాగించారు. సైనిక చర్య అనంతరం హైదరాబాద్ స్టేట్ భారత్ యూనియన్‌లో విలీనం అయ్యే వరకు జమీందారుల ఆధ్వర్యంలో పాలన సాగినా, భూములు, ఇతర హక్కులతోపాటు శిస్తులు వసూలు చేసుకునే హక్కు బ్రిటీష్ వారికే ఉండేది. అనంతరం కృష్ణా జిల్లా పరిధిలోకి ఈ ప్రాంతం మారింది. 1956 వరకు మచిలీపట్నం (బందరు) జిల్లా కేంద్రంగా పాలన కొనసాగింది.
 
 ప్రజల పోరాటం..
 మునగాల ప్రజలు తమ అధికారిక అవసరాలు, పనుల కోసం జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. పాలన సౌలభ్యం కోసమైనా తమ ప్రాంతాన్ని నల్లగొండలో కలపాలని పోరాటాలు చేశారు. ఫలితంగా 1959లో మునగాల, లింగగిరి పరగణా ప్రాంతాలను ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు బదలాయించింది. 1959 జూలై 7వ తేదీన నడిగూడెంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి, నల్లగొండ, కృష్ణా జిల్లాల కలెక్టర్లతో సమావేశమై రికార్డుల మార్పిడి జరిగింది. పన్నెండు గ్రామాల పరిధి ఉన్న లింగగిరి పరగణా 1950, జనవరి 26వ తేదీననే కృష్ణా జిల్లా నుంచి నల్లగొండలో కలిసినా, మునగాల పరగణా మాత్రం 1959 జూలై 7వ తేదీన నల్లగొండకు మారింది. 55 ఏళ్లుగా  జిల్లాలో కొనసాగుతోంది. ప్రజలు పోరాడి ఆంధ్రాప్రాంతానికి చెందిన కృష్ణా జిల్లా నుంచి విడిపోయి నల్లగొండలో విలీనం అయ్యారు. ఇప్పుడు 1956కు ముందు స్థిరపడిన వారే స్థానికులు అవుతారని నిర్ణయిస్తే.. తమకు స్థానికేతరులం అయిపోతామన్నది వీరి వాదన.  
 
 ‘ నల్లగొండ జిల్లా పరిధిలోని మునగాల పరగణాను విడగొట్టి కృష్ణా జిల్లాలో కలపాలన్న ప్రభుత్వ నివేదిక అన్యాయం.. మునగాల ముమ్మాటికీ తెలంగాణలోని నల్లగొండదే..’ అన్న నినాదంతో గత ఏడాది ఆయా తెలంగాణవాద పార్టీలు, ఉద్యమ సంఘాలు ఆందోళనకు దిగాయి. ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారు. మునగాల చరిత్ర తెలుసుకోకుండా తప్పుడు నివేదికలతో కేంద్రాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాయి. ఇది... గత ఏడాది నవంబరు నాటి దృశ్యం .
 
 తెలంగాణ రాష్ర్ట్రంలో.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం  స్థానికతపై కొత్త నిర్వచనం సిద్ధం చేశారు. 1956కు ముందు తెలంగాణ ప్రాంతం లో, హైదరాబాద్‌లో స్థిరపడిన వారి పిల్లలనే స్థానికులుగా గుర్తించే పనిలో ఉంది. ఇది.. తాజా చిత్రం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement