సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా కేంద్రం నుంచి సాయం అందడం లేదని గణాంకాలు చెబు తున్నాయి. పన్ను రూపంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రావాల్సిన నిధుల విషయంలో రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.40 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని తెలుస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర (ప్రస్తుతం కాదు), గుజరాత్ రాష్ట్రాలకు ఉదారంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులిస్తున్న కేంద్రం రాష్ట్రానికి వచ్చేసరికి ఓ రకంగా మొండిచేయే చూపుతోంది. ఆ రెండు రాష్ట్రాలకు బడ్జెట్ అంచనాల్లో 90% వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులిచ్చిన కేంద్రం గత ఆరేళ్లలో ఇప్పటివరకు తెలంగాణ ప్రతిపాదిం చిన అంచనాల్లో 59 శాతమే ఇవ్వడం గమనార్హం. గత ఆరేళ్లలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.1,24,540.09 కోట్లు బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించగా, కేంద్రం మాత్రం రూ.74,097.43 కోట్లు (59%) మాత్రమే ఇచ్చింది.
అదే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.1,65,122 కోట్లలో రూ.1,50,882 కోట్లు (91 శాతం), గుజరాత్ ప్రతిపాదించిన రూ.96,926 కోట్లలో రూ.85,313 కోట్లు (88 శాతం) మంజూరు చేసింది. గుజరాత్ ప్రభుత్వం తెలంగాణ కన్నా దాదాపు రూ.40 వేల కోట్లు తక్కువ ప్రతిపాదించగా, కేంద్రం మాత్రం మన రాష్ట్రం కన్నా రూ.11 వేల కోట్లు ఎక్కువ ఇవ్వడం గమనార్హం. అదే గత ఆరేళ్లలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మనకంటే రెట్టింపు నిధులు మహారాష్ట్రకు మంజూరయ్యాయి. అదే ఆ రెండు రాష్ట్రాలతో సమానంగా మనకు కూడా కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చి ఉంటే అదనంగా ఈ ఆరేళ్లలో మరో రూ.30 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి ఆదాయం వచ్చి ఉండేదని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.
పన్నుల వాటాలోనూ అంతే..
ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.14,348 కోట్లు వస్తాయని అంచనా వేసినా ఇప్పటివరకు (మూడు త్రైమాసికాల్లో కలిపి) వచ్చింది రూ.8,449 కోట్లు మాత్రమే. అంటే రాష్ట్రం ఆశించిన రాబడిలో కేంద్రం ఇచ్చింది 59 శాతమే. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టం ప్రకారం పరిహారం కింద రావాల్సిన మొత్తంలో రూ.1,719 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రావాల్సి ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలలు మాత్రమే జీఎస్టీ పరిహారం ఇచ్చిన కేంద్రం ఆ తర్వాత రాష్ట్రానికి ఆ నిధులు నిలిపేసింది. దీనికి తోడు 2018–19 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారమే కేంద్రం నుంచి పన్ను రూపంలో రావాల్సిన ఐజీఎస్టీ దాదాపు రూ.2,800 కోట్లకు పైగానే ఉంది. అంటే కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి రూ.4,600 కోట్లు రావాలన్నది ప్రభుత్వ వాదన. ఓవైపు గ్రాంట్లు ఇవ్వకుండా రావాల్సిన పన్నులు కూడా కేంద్రం నిలిపేయడంతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, పురోగమన రాష్ట్రం విషయంలో కేంద్ర వైఖరి సరైంది కాదని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారు. ఇటు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఢిల్లీ పెద్దలను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం.
15వ ఆర్థిక సంఘానికీ వినతి..
ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కూడా రాష్ట్ర ఆర్థిక రాబడులపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఈ రెండు పథకాల కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు కాగా, నిర్వహణ కింద 2021–22 నుంచి 2025–26 వరకు రూ. 52,941.25 కోట్లు కావాలని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్రం లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. ఇందులో ఎత్తిపోతల పథకాలకు రూ.40,169.20 కోట్లు, మిషన్ భగరీథకు రూ.12,772 కోట్లు కావాలని (ఏటా దాదాపు రూ.10 వేల కోట్లు) విజ్ఞప్తి చేసింది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులను పూర్తి చేసేందుకు దాదాపు రూ.8 వేల కోట్ల వరకు కావాల్సి ఉంది. రైల్వేలైన్లు, ఎంఎంటీఎస్ రెండో దశ లాంటి పనులకు గాను కేంద్రం వాటా రావాలంటే మన వాటాను కూడా విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేయాలంటే రాష్ట్రానికి వస్తున్న రాబడులు, ఖర్చులకు అనుగుణంగా కేంద్రం నుంచి అదనపు సాయం అందాల్సి ఉంది.
అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వాలన్నా కేంద్రం నుంచి పన్నుల వాటా ఆశించిన మేర రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న విధంగా అదనపు సాయంతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపు విషయంలో ఉదారత చూపించాల్సి ఉంది. ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల వరకు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర రాబడులకు తోడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఏ మేరకు దయ చూపుతారన్న దానిపై 2020–21 ఆర్థిక సంవత్సరం ఆధారపడి ఉందని ఆర్థిక నిపుణులంటున్నారు. నిర్మలమ్మ రాష్ట్రంపై కరుణ చూపకపోతే వచ్చే ఏడాది కూడా నిధులకు కటకటేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment