ఆ నలుగురే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు
► మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి
రామగుండం(పెద్దపల్లి జిల్లా): తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్‌రావు మాత్రమే పాలిస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, అవి అటకెక్కడానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో మిగిలిన ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రిడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.