బీసీ రిజర్వేషన్ల పెంపుపై టీ.సర్కార్ కసరత్తు
హైదరాబాద్ : ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్ల కోటాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు చేపట్టింది. బీసీ కమిషన్‌కు విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. రిజర్వేషన్ల పెంపునకు అవసరమైన పూర్తి సమాచారం సేకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌కు తెలంగాణ సర్కార్ సూచనలు చేసింది. ఎంబీసీలు, సంచార జాతులపై ప్రత్యేకంగా దృష్టి, వారి స‍్థితిగతులు కూడా అధ్యయనం చేయాలని పేర్కొంది.
ఇందుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (టీవోఆర్)లు కూడా కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. కాగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీలకు, ముస్లింలకు (బీసీ-ఈ) 12 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీల్లోని ఇతర కులాల వారికీ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీసీ కమిషన్ అధ్యయనం చేసి, రూపొందించిన నివేదిక అందాక వారికి కూడా రిజర్వేషన్లు పెంచుతామని,. బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గవని సీఎం గతంలో స్పష్టం చేసిన విషయం విదితమే.