‘పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసు’ | Telangana A Welfare State Says TRS Working President KTR | Sakshi
Sakshi News home page

‘పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసు’

Published Sun, Jul 21 2019 7:00 AM | Last Updated on Sun, Jul 21 2019 7:00 AM

Telangana A Welfare State Says TRS Working President KTR - Sakshi

సిరిసిల్ల: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రూ.43 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘ఆసరా’ పించన్లు మంజూరు పత్రాలను శనివారం ఆయన లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో అగ్రభాగం సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నామని వివరించారు. రాష్ట్ర జనాభా 3.60 కోట్లు కాగా, 50 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్‌ అర్హత వయసును 57కి తగ్గించడంతో రాష్ట్రంలో మరో రెండు లక్షల మందికి లబ్ధి కలుగుతోందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఏటా రూ.12వేల కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, అంటే.. నెలకు రూ.వెయ్యి కోట్లతో పేదలకు ఆసరా కల్పిస్తున్నామని అన్నారు. రూ.12 వేల కోట్ల పింఛన్‌ సొమ్ములో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.200 కోట్లని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం 17 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ‘రాష్ట్రంలో ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’నినాదాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 700 గురుకులాల్లో 3 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు వెచ్చిస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. 

మనసున్న సీఎం..
పేదలకు ఏం కావాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసని కేటీఆర్‌ పేర్కొన్నారు. మనసున్న సీఎం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు, కేసీఆర్‌ కిట్టు అందిస్తున్నామని వివరించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, కాలేజీ స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల పెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులకు పింఛన్లతో ఆసరా కల్పిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను రెట్టింపు చేశామన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ఎలాంటి పైరవీ అవసరం లేదని, ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పని లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ జోక్యం ఉండదని సీఎం ప్రకటించారని వివరించారు.

గత పాలకులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఖరీదు రూ.70వేలని ఆయన పేర్కొన్నారు. ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లుతో పోల్చితే.. ఎనిమిది ఇందిరమ్మ ఇళ్లకు సమానమని కేటీఆర్‌ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా పేదల సమాచారం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. అర్హులు ఎక్కువగా ఉంటే కలెక్టర్‌ సమక్షంలో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. జాగా ఉన్న వారికి సీఎం చెప్పినట్లుగా ఇల్లు కట్టుకోడానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తున్నారు. 

మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ
రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాలకు వడ్డీ రాయితీని ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. రూ.65 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘మీ బాకీ ఉంచుకోం’అని మహిళలను ఉద్దేశించి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల నేతన్నలకు రూ.300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి ఆదుకున్నామని చెప్పారు. సభలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement