'2018లో పుట్టిన పిల్లలకు కరెంటుకోత అంటే తెలియదు!'
మరో మూడేళ్ల తర్వాత.. అంటే 2018 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు కరెంటు కోత అంటే ఏంటో తెలియనివ్వబోనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2017 నాటికి తెలంగాణలో రైతులకు 12 గంటల విద్యుత్ ఇస్తామని, అది కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. 2018 నాటికి తెలంగాణలో 23 వేల మెగావాట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
2019లోగా ప్రతి గ్రామానికి మంచినీరు అందిస్తామని, నీళ్లు ఇవ్వకుంటే 2019లో ఓట్లు అడిగేది లేదనే మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. జగిత్యాలను త్వరలోనే జిల్లాగా మారుస్తామని, జగిత్యాల జిల్లా ఏర్పాటు కోసం త్వరలోనే పాదయాత్ర చేస్తానని తెలిపారు. అర్హులై ఉండి ఇప్పటికీ పెన్షన్లు రానివాళ్లు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలని, అలా చేస్తే 15 రోజుల్లోనే పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు.