'బంగారు తెలంగాణ కోసం ప్రజల ఎదురుచూపులు'
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని వారు ఈ సందర్భంగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం తెలంగాణ వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదన్నారు.
పంటలకు మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించాలని పొంగులేటి తెలిపారు. విద్యుత్ సమస్యపై కేంద్రంతో చర్చిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. కాగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.