అంతం కాదిది.. ఆరంభమే...
ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాడతాం: పొన్నాల
కేసీఆర్ వ్యాఖ్యలు అవివేకం
‘రుణం’పై కాంగ్రెస్ రణం
హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొని, అరెస్టు అయిన పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం గాంధీభవన్‌లో పొన్నాల మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా.. ఏ ఒక్క పని మొదలుపెట్టలేదని చెప్పిన సీఎం.. కేసీఆర్ తప్ప ఈ ప్రపంచంలో మరొకరు ఉండరేమోనని ఎద్దేవా చేశారు. ‘రూ.1.18 లక్షల కోట్ల రుణమాఫీ యూపీఏ హయాంలోనే సాధ్యమైంది.. అందులో రాష్ర్ట రైతాంగానికి ఎక్కువ లబ్ధి జరిగింది. కేసీఆర్ తన ఫాంహౌస్‌లో ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారంటే అది నాటి కాంగ్రెస్ చలువే.. ఉచిత విద్యుత్ అమలు అసాధ్యమని మేధావులు, ప్రపంచబ్యాంకు చెప్పినా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల్లోనే అమలు చేసి.. నిరూపించిన ఘనత నాటి కాంగ్రెస్ సీఎందే.. ప్రపంచంలో ఎవరూ చేయలేనని గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తమ ప్రభుత్వంపై కేసీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు’ అనిమండిపడ్డారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలో పొన్నాల మాట్లాడుతూ.. ‘ఎకరా భూమిలో కోటి రూపాయలు సంపాదిస్తాననే కేసీఆర్ రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. ధర్నాలో మాజీ మంత్రులు దానం నాగేందర్, ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు
నెట్‌వర్క్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణలోని అన్ని కలెక్టరేట్‌ల ఎదుట డీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.