అలయ్ ‘భలే’య్!
లంబాడ నృత్యాలు.. గంగిరెద్దుల ఆటలు.. బతుకమ్మ పాటలతో జోష్
నోరూరించిన మక్క గారెలు.. సర్వపిండి.. శనగ గుడాలు
ఇరు రాష్ట్రాల సీఎంలతోపాటు రాజకీయాలకతీతంగా ప్రముఖులు హాజరు
రెండు రాష్ట్రాలూ ప్రేమతో కలిసి ఉండాలన్న గవర్నర్
కళాకారులతో కదం కలిపిన దత్తన్న
ఆటపాటలతో అలరించిన గోరటి వెంకన్న
హైదరాబాద్: లంబాడ నృత్యాలు, చిందు బాగోతాలు.. గంగిరెద్దుల ఆటలు, బతుకమ్మ పాటలు.. బుర్ర కథలు, హరిదాసు కీర్తనలు.. ఒగ్గు కథలు, దున్నపోతు ఆటలు.. మొత్తంగా అలయ్ బలయ్ అదిరిపోయింది! జొన్న రొట్టెలు.. మక్క గారెలు.. సకినాలు.. యాట కూర.. కోడి పులుసు.. పొట్టు రొయ్యలు.. సర్వపిండి.. పచ్చి పులుసు.. చింత తొక్కు.. శనగ గుడాలతో తెలంగాణ రుచుల కమ్మదనానికి వేదికైంది. విజయ దశమి సందర్భంగా సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆదివారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ జోరుగా సాగింది. దత్తాత్రేయ స్వయంగా కుటుంబ సభ్యులు, కళాకారులతో కలిసి ఆటలాడి అలరించారు. రాజకీయాలకు అతీతంగా అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదేళ్లు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది అలయ్ బలయ్. ఇన్నాళ్లూ తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, ఉద్యమకారుల ఆవేదనలు, ఆలోచనలు పంచుకోవడానికి వేదికగా ఉన్న అలయ్ బలయ్... ఈసారి తెలంగాణ రావడంతో ఉత్సాహంగా సాగింది. గవర్నర్‌తోపాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో అధికారిక కార్యక్రమంగా మారిపోయింది. తెలంగా ణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత బతుకమ్మ పాటలు, గోరటి వెంక న్న ఆటపాటలు ఆహుతులను ఆక ట్టుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ స్పీకర్ మధుసూదనచారి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, బి.వినోద్‌కుమార్, జితేందర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. నాయకులు సిరిసిల్ల రాజయ్య, రామచంద్రు నాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, మురళీధర్‌రావు,ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎవరేమన్నారంటే..
బంధు దత్తాత్రేయ అని పేరు పెట్టాలి: గవర్నర్
రాజకీయాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయకు బంధు దత్తాత్రేయ అని పేరు పెట్టాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. పదేళ్లుగా అందరిలో బంధుత్వాన్ని నింపుతున్నారని కొనియాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రేమతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
అలయ్ బలయ్‌కి ఐకాన్ దత్తన్న: సీఎం కేసీఆర్
అలయ్ బలయ్ కార్యక్రమం అంటేనే దత్తన్న అని, దానికి ఆయనే ఐకాన్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమం జరిగే సమయంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరినీ ఇక్కడికి పిలిచేవారని, తెలంగాణ సాధన ప్రణాళికకు ఇది వేదికగా ఉండేదన్నారు. తాను పార్టీ కార్యక్రమంతో ఆదివారం బిజీ అయినప్పటికీ దత్తన్న పిలిచారు కాబట్టి కచ్చితంగా రావాల్సిందేనని, అందుకే వచ్చానని చెప్పారు.
ఐకమత్యం లేకనే ఇబ్బందులు: చంద్రబాబు
ప్రపంచంలో ఇబ్బందులు రావడానికి కారణం ఐకమత్యం లేకపోవడమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఐకమత్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహించడంలో దత్తాత్రేయ సఫలం అయ్యారని, రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేరుగానే ఉన్నా అంతా కలిసి ఉండాలన్నారు. భౌగోళికంగా విడిపోయినా మానసికంగా తెలుగువారంతా కలిసే ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జై ఆంధ్రప్రదేశ్-జై తెలంగాణ-జై తెలుగుదేశం అంటూ నినాదం చేశారు.
తెలంగాణ రుచుల కమ్మదనం: స్పీకర్
తెలంగాణ రుచుల కమ్మదనానికి ఈ కార్యక్రమం ఏటా వేదిక అవుతోందని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఇది ప్రపంచానికి తెలంగాణ రుచుల గొప్పదనం చూపించే కార్యక్రమమని చెప్పారు.
కలిసి ఉండాలన్నదే ఉద్దేశం: వెంకయ్యనాయుడు
రాయకీయాలు వేరైనా, పార్టీలు వేరైనా, విమర్శలు చేసుకున్నా.. మనం అంతా భారతీయులమని, అంతా కలిసి ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు అన్నారు. అలయ్ బలయ్ లక్ష్యం కూడా అదేనని చెప్పారు. టీవీ, సినిమాల వల్ల పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్నారని, మన సంస్కృతి సంప్రదాయాలను, యాస, భాషలను కాపాడుకోవాలని..రాబోయే తరాలకు అందించాలని కోరారు.
ఇద్దరు సీఎంలు ప్రేమతో మెలగాలి: దత్తాత్రేయ
రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలు ప్రేమ, ఆత్మీయతతో మెలగాలని ఎంపీ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ కలిసి ముందుకు సాగాలన్నారు.