టీ పీసీసీకి కొత్త అధ్యక్షుడు!
అధిష్టానం పొన్నాలను తొలగించనుంది: వీహెచ్
కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు ఉండాలని వ్యాఖ్య
మండిపడ్డ పొన్నాల.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోనని హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ పీసీసీలో సీనియర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీని ప్రక్షాళన చేసేదిశగా టీపీసీసీ చీఫ్‌ను అధిష్టానం తప్పించనుందని ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ వి.హనుమంతరావు పేర్కొనగా... పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే సీనియర్లనైనా వదిలిపెట్టబోమంటూ పొన్నాల తీవ్రంగా స్పందించారు. శనివారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీ అనంతరం వీహెచ్ మాట్లాడగా.. అనంతరం పొన్నాల గాంధీభవన్‌లో వీహెచ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
వీహెచ్ శనివారం ఉదయం సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివాసానికి వెళ్లి కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుని మార్పు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారని ఆయన చెప్పారు. అందులో భాగంగా పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు అవసరం ఉందన్నారు. ఈ సారి టీపీసీసీ అధ్యక్షుని నియామకం ఢిల్లీలో జరగకూడదని... పార్టీ పెద్దలు రెండ్రోజులపాటు రాష్ట్రంలో మకాం వేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నియమించాలని వ్యాఖ్యానించారు.
క్రమశిక్షణ మీరొద్దు..
వీహెచ్ వ్యాఖ్యలపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా తనకు సన్నిహితులేనని, పార్టీకి ఉపయోగపడే సూచనలు చేస్తామంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వీహెచ్‌లాంటి వ్యక్తులకు తన స్థాయి తక్కువనుకుంటే హైకమాండ్ పెద్దలను కలసి అభిప్రాయాలను చెప్పుకోవచ్చన్నారు.