
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
తూప్రాన్ : మండలం వెంకటాయిపల్లిలో గురువారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ టెన్త్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు.. వెంకటాయిపల్లికి చెందిన సయ్యద్ అలీకి రెండో కుమార్తె సయ్యద్ హసీనా (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో సెల్‌ఫోన్ మోగింది. తల్లిదండ్రులు నిద్రిస్తుండడంతో.. హసీనా ఫోన్ తీసి ఇంటి బయటకెళ్లి మాట్లాడింది. కొద్దిసేపటి తర్వాత సయ్యద్ అలీకి మెలకువ రాగా, కుమార్తె కనిపించకపోవడంతో ఆయన బయటకొచ్చాడు. హసీనా ఏడ్చుకుంటూ వస్తుండడంతో ఏమైందంటూ తండ్రి ఆరా తీశాడు. ఆమె ఏమీ చెప్పకుండా.. తాను గురువారం ఉపవాస దీక్ష ఉంటానని మాత్రమే చెప్పి పడుకుంది. కాగా, గురువారం తెల్లవారుజాములోపే స్నానం చేసి ఓ గదిలోకి వెళ్లిన హసీనా గడియ పెట్టుకుంది. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
కేకలు విన్న తండ్రి ఇరుగు పొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లేలోపే హసీనా మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా..
అర్ధరాత్రి సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ గ్రామానికి చెందిన వ్యక్తిదని, అతను పరారీలో ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.