
గెలిచినా.. తప్పని నిరీక్షణ
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ‘స్థానిక’ ఎన్నికల బరిలో గెలిచినా.. అధికారిక హోదా దక్కకపోవడంతో ప్రజాప్రతినిధులు ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలో 873 మంది ప్రమాణస్వీకారం కోసం నిరీక్షిస్తున్నారు. అనేక సమస్యలతో వస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
జిల్లాలో జెడ్పీటీసీలు 46, ఎంపీటీసీలు 682, మున్సిపల్, నగర పంచాయతీలో కలిపి 145 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మే 12, 13న ఓట్ల లెక్కింపు పూర్తిచేశారు. ఫలితాలు వచ్చి నెల రోజులు కావస్తోందని, గెలిచిన సంతోషం కూడా కరువైందని ప్రజాప్రతినిధులు ఆవేదన చెం దుతున్నారు. జూన్ 2న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, నగర పంచాయతీ వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం కోసం ఎదురుచూస్తున్నారు. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులపై ఆశలు పెంచుకున్నవారు ఎంపీటీసీలు, జెడ్పీటీసీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం.
పేరుకుంటున్న సమస్యలు..
గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల వద్దకు సమస్యల పరిష్కరం కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఇంత వరకు ప్రమాణస్వీకారం చేయకపోవడంతో ఏం చేసే పరిస్థితిలేదు. కనీసం కార్యాలయాలకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, వీధి ధీపాలు వంటి సమస్యలు పేరుకుపోతున్నాయి. దీంతో గ్రామస్థులు ఆసంతృప్తికి గురవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు సైతం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఎప్పుడోనని ఎదురు చూస్తున్నారు.