సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి ఆపై పార్టీని వీడిన డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణల ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని టీపీసీసీ నిర్ణయించింది. పదవులు, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన ద్రోహుల ఫొటోలను గాంధీభవన్‌లో ఉంచాల్సిన అవసరం లేదని టీపీపీసీ నేతలు గురువారం ప్రతిపాదించారు. మరోసారి ముఖ్యులతో మాట్లాడి ఈ ప్రతిపాదనను అమలు చేయనున్నారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆలోచించండి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై దృష్టి సారించాలని ఎంపీ వి.హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే దానిపై పరిశీలించాలని కోరారు. దిగ్విజయ్‌తో గురువారం ఇక్కడ వీహెచ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యటన ఒకట్రెండు రోజులకు పరిమితం చేయకుండా, వారం రోజులు ఉండి పరిస్థితులపై సమీక్షించాలని దిగ్విజయ్‌ను కోరారు. అనంతరం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినట్టు చెబుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ నాడు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణాజలాలు పోతిరెడ్డిపాడుకు తరలిపోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
‘లాబీయిస్టులను నమ్మితే ఇదే సమస్య’
పార్టీకి నమ్మకస్తులుగా పనిచేసే వారిని కాకుండా డీఎస్ లాంటి లాబీయిస్టులను నమ్మితే వ్యక్తిగత స్వార్థంకోసం పార్టీని కష్టకాలంలో విడిచిపెట్టి పోతారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్‌కు అర్హత కంటే ఎక్కువగా పదవులు వచ్చాయని, పార్టీ కోసం పని చేయకుండా ఇలాంటి సంక్షోభ సమయంలో పార్టీని వీడాలని తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు.
ఆ నేతల ఫొటోలు తీసేశారు!
Published Fri, Jul 3 2015 2:57 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement