రగులుతున్న ఓయూ
ఉస్మానియాలో కొనసాగిన నిరసన ర్యాలీలు.. రాస్తారోకోలు
లాఠీచార్జీలు, అరెస్టులతో అట్టుడికిన విశ్వవిద్యాలయం
సిటీబ్యూరో/ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ ఉద్యమ కేంద్రం ఉస్మానియా వర్సిటీ యుద్ధభూమిగా మారుతోంది. వరుసగా మూడోరోజు నిరసన ర్యాలీలు, అరెస్టులు, లాఠీచార్జీలతో క్యాంపస్ అట్టుడుకింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను స్వాగతిస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు.. దానిని వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ శుక్రవారం పోటాపోటీగా ర్యా లీలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెల కొంది. రెండు ర్యాలీలు ఒకే సమయంలో మొదలు కావడంతో ఆర్ట్స్ కళాశాల వద్ద పరిస్థితి అదుపుతప్పింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి, పది మంది విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఐక్య పోరాటాల నుంచి ఆధిపత్య పోరు..
తెలంగాణ ఉద్యమంలో ఐక్యంగా ఉద్యమించిన వివిధ విద్యార్థిసంఘాలు ఇప్పుడు ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం క్రమంగా విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. కొన్ని సంఘాలు క్రమబద్ధీకరణను సమర్థిస్తుండగా మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మూడు రోజులుగా విద్యార్థి సంఘాల మధ్య ఈ విషయమై ఘర్షణలు, పరస్పర దాడులు జరుగుతుండడంతో ఓయూ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు ఇప్పటి వరకు వర్సిటీకి వీసీ లేకపోవడంతో పాలన స్తంభించింది. ఐఏఎస్ అధికారిని తాత్కాలిక వీసీగా నియమించినా పరిపాలనాపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఒకవైపు విద్యార్థి సంఘాల ఘర్షణ, మరోవైపు పాలన స్తంభించడంతో విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో తరగతులు జరగడం లేదు. దీంతో తమ భవిష్యత్తుపై ఓయూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మంత్రుల వెనుకడుగు...
ఒకప్పుడు తెలంగాణ విద్యార్ధి జేఏసీ, ఓయూ జేఏసీలు చేపట్టిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన టీఆర్‌ఎస్ పార్టీ తాజా పరిణామాలకు మాత్రం దూరంగా ఉంటోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనుకూలంగా సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో విద్యార్థులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సీఎం కేసీఆర్ వర్సిటీకి వెళ్లాలనుకున్నప్పటికీ ఆ సాహసం చేయలేకపోతున్నారు. గత నెలలో జయశంకర్ జయంతి సందర్భంగా వర్సిటీలో నాన్‌టీచింగ్ స్టాఫ్ జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, ఈటెల, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిఉన్నా.. విద్యార్థుల ఆందోళనతో వారూ ముఖం చాటేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు ఆందోళనను విరమించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ప్రతిపక్షపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కొన్ని సంఘాలకు మద్ధతుగా నిలుస్తుండడంతో ఉద్రిక్తత పెరిగింది.
అశాంతికి ప్రభుత్వానిదే బాధ్యత...
ఇలా ఉండగా, ఉస్మానియా యూనివర్సిటీలో అశాంతికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని టి. విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్, అధ్యక్షులు మానవతరాయ్, అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓయూలో ప్రభుత్వ దమనకాండను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి సంఘం తన ఆధిపత్యం కోసమే విద్యార్థులపై దాడులకు తెగబడుతోందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీఎస్ జేఏసీ చెర్మైన్ పిడమర్తి రవి పేర్కొన్నారు.