మానవత్వం మంట కలిసింది. అభంశుభం తెలియని నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రైలు పట్టాలపై వదిలేయడంతో ప్రాణాలు విడిచింది.
- మెదక్ జిల్లా నాగులపల్లి వద్ద ఘటన
రామచంద్రాపురం: మానవత్వం మంట కలిసింది. అభంశుభం తెలియని నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రైలు పట్టాలపై వదిలేయడంతో ప్రాణాలు విడిచింది. ఏడాదిలోపు వయసుగల పసిగుడ్డు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం నాగులపల్లి సమీపంలో రైల్వే ట్రాక్‌పై శనివారం వెలుగుచూసింది. సుమారు ఆరు నెలల నుంచి ఏడాది వయస్సుగల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై వదిలివెళ్లారు. చిన్నారిపైనుంచి రైలు పోవడంతో మృతి చెందింది. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడపిల్ల కావడంతోనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు.