వరుడే.. వధువాయె..!
ఖమ్మం: వివాహం పూర్తయ్యాక.. పెళ్లి కుమారుడు చీర కట్టి స్త్రీ వేషధారణతో రావడంతో పెళ్లికి వచ్చినవారంతా అవాక్కయ్యారు. ఊరేగింపుగా ముత్యాలమ్మ గుడి వరకు నడిచి మొక్కులు చెల్లించి, ఇది తమ కుటుంబ ఆచారమని తెలపడంతో అంతా వింతగా చూశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెంకు చెందిన కాటేపల్లి చంద్రశేఖర్‌కు కృష్ణాజిల్లా అనిగండ్లపాడుకు చెందిన కృష్ణవేణితో ఆదివారం వివాహమైంది.
పెళ్లికుమారుడు కుటుంబ ఆచారం ప్రకారం పెళ్లి జరిగాక చీరకట్టి, స్త్రీ వేషధారణలో నడిచి వస్తుంటే.. పాదం నేలపై తాకకుండా గుడివరకు చీరలు పరుస్తూ.. వారి కుటుంబ సభ్యులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దీంతో స్థానికులు, పెళ్లికి వచ్చిన బంధువులంతా ఆశ్చర్యంగా చూశారు.