వృథా కాదు.. ఆదా | The consumption of objects such as Experimental equipment | Sakshi
Sakshi News home page

వృథా కాదు.. ఆదా

Published Mon, Oct 27 2014 2:52 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

వృథా కాదు.. ఆదా - Sakshi

వృథా కాదు.. ఆదా

* ప్రయోగ పరికరాలుగా వస్తువుల వినియోగం
* ఇక తరగతి గదిలోనే ప్రయోగాలు
* విద్యార్థులకు ప్రోత్సాహం
* సంక్షోభాలపై పరిశోధనలు

సిద్దిపేట టౌన్: తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్ణయమౌతుందని అంటారు. మరి తరగతి గదులు యాంత్రికంగా ఉంటే సృజనాత్మకత ఎలా వెల్లివిరుస్తుంది? ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తల నిర్మాణం ఈ ప్రాంతానికి అనివార్యం. కానీ సర్కార్ బడుల్లో ఒక చోట ప్రయోగశాలలు మరో చోట తరగతి గదులు. అన్ని ప్రయోగశాలల్లో పరికరాలు, రసాయనాలు ఉండవు. శాస్త్రీయంగా ప్రయోగాలను మనసుకు హత్తుకుపోయేలా చెప్పడానికి కొన్ని చోట్ల టీచర్లు ఉండరు. ఈ నేపథ్యంలో తరగతి గదినే ప్రయోగశాలగా మార్చాలనే సంకల్పం చిగురించింది. వృథాగా పడేసే వస్తువులను, తక్కువ ధరలో లభ్యమయ్యే సామగ్రిని ప్రయోగ పరికరాలుగా వాడడం ద్వారా విద్యార్థులు ఎప్పుడైన, ఎక్కడైన మదిలో మెదిలిన ఆలోచనను ప్రయోగాలుగా మలిచే అవకాశం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రయోగించింది.
 
సిద్దిపేట డివిజన్‌లోని 13 మండలాల సైన్స్ టీచర్లకు 16 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. తరగతి గదిలోనే 70 రకాల ప్రయోగాలను ఎలా నిర్వహించాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ప్రపంచాన్ని మార్చేసిన ఫాస్కల్ లా, ఆర్కిమెడిస్, ఫెరడిన్, న్యూటన్, హోమ్స్ తదితర శాస్త్రవేత్తలు మానవాళి వికాసానికి నిర్వహించిన ప్రయోగాలను ప్రత్యక్షంగా కళ్లముందు నిలిపారు. బెర్నొలిక్ (గాలిలో విమానాల ఎగురవేత) సూత్రం, గాలిలో పీడనం, శక్తి నిత్యత్వ నియమం, విద్యుత్ మోటర్‌లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం, పవన విద్యుత్ తయారీ, వాహనాలు రోడ్డుపై వెళ్తుంటే వాహనాల టైర్లు, రోడ్ల మధ్య జరిగే ఘర్షణ నుంచి విద్యుత్ తయారీ మొదలగు ప్రయోగాలను ప్రదర్శించారు.
 
ఇందులో కొన్ని ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి పరిష్కారాలను చూపడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలకు బీజాలు వేశాయి.
 
కావేవి ప్రయోగాలకు అనర్హం!
వినియోగించి వదిలివేసే వివిధ రకాల బాటిల్స్, వైర్లు, పెన్సిల్స్, సీడీలు, సైకిల్ పుల్లలు, గ్లూకోజ్ బాటిల్స్, సెలైన్ పైపులు, ఆట వస్తువులు, పిన్నులు, టెన్నిస్ బాల్స్, సీసాల మూతలు, తక్కువ ధరలో లభించే రబ్బర్లు, బెలున్స్, స్ట్రా, అగ్గి పుల్లలు, టీ కప్పులు, పేపర్లు, అయస్కాంతాలను వినియోగించి ఈ ప్రయోగాలను నిర్వహించారు. ఇవి సాధారణంగా అందుబాటులో ఉంటాయి. బళ్లో, ఇంట్లో కూడా వీటిని వినియోగించి సరికొత్త ప్రయోగాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది.
 
నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు
జనవిజ్ఞాన వేదిక ద్వారా మూఢనమ్మకాలు, మంత్రాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సైన్స్ ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ స్ఫూర్తితో విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులను వెలికితీసి బాల శాస్త్రవేత్తలుగా మలవాలనే సంకల్పం కలిగింది. ఇందుకు ప్రభుత్వం వేదికను ఏర్పాటు చేయడంతో సైన్స్ టీచర్లకు విభిన్న ప్రయోగాలను కళ్లముందు చేసి చూపించాను. వారిలో ఉత్సాహం పెల్లుబికింది. లో కాస్ట్ - నో కాస్ట్ విధానంలో ప్రయోగాలు తరగతి గదిలోని నిర్వహించుకునే అవకాశం ఉంది.
     - సాదత్ అలీ, సిద్దిపేట డివిజన్ సైన్స్ రిసోర్స్ పర్సన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement