నల్లగొండ టౌన్: భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఎండల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 15 వరకు అకాల వర్షాల కారణంగా పగటి ఊష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. కానీ మల్లి భానుడి ప్రతాపానికి తిరిగి పగటి ఊష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, గొర్రెల మేకల పెంపకం దారులు వడదెబ్బ బారిన పడి పిట్టల్లా రాలి పోతున్నారు.
ఎండ తీవ్రత కారణంగా చాలా వరకు పనుల నిమిత్తం బయటకు వెళ్లనప్పటికీ ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలు ఎక్కువగా వడదెబ్బకు గురై చనిపోతున్నారు. ఉదయం 8 గంటలకే వేడి తీవ్రత పెరిగి బయటకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. మద్యాహ్నం 12 గంటలకు రోడ్లున్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. గురువారం ఉష్ణోగ్రత 42.0 డిగ్రీలకు చేరడంతో అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, వ్యాపారులు ఏసీలు, కూలర్లతో సేద తీరుతుండగా ప్రజలు మాత్రం ఇళ్లలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వడదెబ్బ మరణాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోవడం జిల్లా ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మునగాల మండలం వీరప్పపల్లెకు చెందిన శీలం నాగేశ్వర్‌రావు, మోత్కూరుకు చెందిన కృష్ణస్వామి, మోతే మండల కేంద్రానికి చెందిన ఎ. రామచంద్రు, చందంపేటకు చెందిన సత్యనారాయణచారి,గురిజాలకు చెందిన కె.రవి, హాలియా మండలం ఎర్ర చెరువుతండాకు చెందిన రవావత్ బాణు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన మదన్‌సింగ్, చండూరుకు చెందిన పాపిరెడ్డి, ఇటుకలపహాడ్‌కు చెందిన మేకల జయరాజు వడదెబ్బబారిన పడి మృత్యువాతపడ్డారు.
అదే విధంగా వాడపల్లికి చెందిన జానీ, కోదాడకు చెందిన అప్పారావు, దామచర్ల మండలం బొల్లిగట్టుతండారు చెందిన సుక్యా, గట్టుమీదితండాకు చెందిన బీమానాయక్, మిర్యాలగూడకు చెందిన బాలసువర్చల, అవంతిపురానికి చెందిన కె.సైదులు, చందెంపల్లికి చెందిన గంగరాజు సత్తయ్య, మోత్కూరు చెందిన కూరెళ్ల మల్లయ్య, నీలాయిగూడెంకు చెందిన షేక్ బికాని, చౌటుప్పల్ మండలం అల్లాపురంకు చెందిన మల్లారెడ్డి, యాద్గర్‌పల్లికి చెందిన చిమట సైదులు, మిర్యాలగూడకు చెందిన సత్యం, తిప్పర్తికి చెందిన జ్యోతి, కేసారంకు చెందిన దేవయ్య, పీఏపల్లికి చెందిన చంద్రయ్య, కోదాడకు చెందిన చాందుమియా, ఆలేరుకు చెందిన స్వామి, పెద్దవూరకు చెందిన రావు చంద్రయ్య, భువనగిరి మండలం తుక్కాపూర్‌కు చెందిన వల్లపు మల్లేషంలు వడదెబ్బకారణంగా చనిపోయారు.
వడదెబ్బ లక్షణాలు
ఎండలో తిరిగినా , పనిచేసినా శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతినడంతో వడదెబ్బకు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల నుంచి 110 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పెరుగుతుంది. వడదెబ్బ బాధితుల్లో 40శాతం వరకు మరణించే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బకు గురైన వ్యక్తికి తలతిరగడం, తలనొప్పి, చర్మం ఎండిపోయి ఉంటుంది. ఎక్కువ జ్వరం కలిగి ఉంటారు. మగతగా కలవరించడం, ఫిట్స్ రావడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్తారు.
వడదెబ్బ నుంచి రక్షణ ఇలా
- పి.ఆమోస్, డీఎంహెచ్‌ఓ
గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక రోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో తిరగరాదు. ఎండ తీవ్రత ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కూడా ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే ఉప్పు కలిపిన మజ్జిగ, పండ్ల రసాలు తాగి వెళ్లాలి. సాధ్యమైనంత వరకు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేత రంగు, కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ఇంటి గదుల్లో ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.
చల్లని వాతావరణం కోసం ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్లు వాడాలి. వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని వెంటనే చల్లబర్చాలి. చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి శరీరంపై ఉన్న దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగాలి. చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి. చల్లని గాలి తగిలేలా ఉంచి చల్లని ఉప్పు కలిగిన నీటిని తాగించాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని ఎలాంటి ఆలస్యం చేయకుండా దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.
భానుడి భగ.. భగ
Published Fri, May 1 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement