- స్పందించని ప్రజాప్రతినిధులు
- చొరవచూపాలని ప్రజల వినతి
తాండూరు: నాపరాతి వ్యర్థాలతో తలెత్తుతున్న కాలుష్యం నుంచి తాండూరు ప్రజలకు విముక్తి కలగటం లేదు. పారిశ్రామికవాడ(ఇండస్ట్రీయల్ ఎస్టేట్) ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధుల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సుమారు ఐదేళ్లుగా ఊరిస్తున్న పారిశ్రామికవాడ ఏర్పాటుపై అధికారులు ఊదాసీనతను ప్రదర్శిస్తున్నారు. మైక్రో స్మాల్‌అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్‌ఎంఈ) కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నా స్థల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో ఏళ్లుగా పారిశ్రామిక వాడ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. తాండూరు మండలం జినుగుర్తిలో సర్వే నంబర్ 206లో 300 ఎకరాల అసైన్డ్‌భూమిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించాలని గతంలో రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.
ఇంత వరకు ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సంబంధించి స్థలం కేటాయింపుపై తాజాగా ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ తాండూరు రెవెన్యూ అధికారులకు వారం రోజుల క్రితం లేఖ రాసింది. రెండు,మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపించనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా తాండూరు పట్టణం చుట్టూ దాదాపు 500 వరకు నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి.
వీటి ద్వారా నాపరాతి ముక్కలు, ఇతర డస్టును పట్టణంలో రోడ్ల పక్కన డంపింగ్ చేస్తున్నారు. తద్వారా కాలుష్య సమస్యతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పాశ్రామిక వాడ ఏర్పాటు చేసి, పట్టణం చుట్టూ ఉన్న పాలిషింగ్ యూనిట్లను అక్కడికి తరలించాలనే డిమాండ్ ఉంది. ఇందుకు నాపరాతి పరిశ్రమ వర్గాలు కూడా అంగీకరించా యి. స్థలం కేటాయింపులో జరుగుతున్న జాప్యంతో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
పారిశ్రామికవాడ ఏర్పాటులో జాప్యం!
Published Mon, May 4 2015 12:27 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement