నిరాశే మిగిలింది | The district fought desperate | Sakshi
Sakshi News home page

నిరాశే మిగిలింది

Published Mon, May 26 2014 11:31 PM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM

The district fought desperate

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  కేంద్ర మంత్రి పదవుల విషయంలో జిల్లాకు తీరని నిరాశే మిగిలింది. కనీసం ఒక్క కేబినెట్ బెర్తయినా దక్కుతుందని ఆశించిన జిల్లా వాసులకు అడియాసలే మిగిలాయి. సహాయ మంత్రి పదవి కూడా లభించకపోవడం వారిని మరింత అసంతృప్తికి గురిచేస్తోంది. గడిచిన యూపీఏ-2 ప్రభుత్వంలో జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిచ్చి పెద్దపీట వేశారు. 2009లో కొత్తగా ఏర్పడిన పార్లమెంటు నియోజవర్గాలైనప్పటికీ గెలిచిన ఇరువురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయి తే మోడీ ఏర్పరిచిన నూతన ప్రభుత్వంలో స్థానం లేకపోవడం విచారం కలిగిస్తోంది.
 
 ఒక్కరికీ అవకాశం లేదు
 ఎన్డీఏ కూటమి తరఫున ఇద్దరు ఎంపీలు జిల్లా నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం పక్షాన చామకూర మల్లారెడ్డి లోక్‌సభకు ఎన్నికవగా, అదే పార్టీకి చెందిన సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ రాజ్యసభలో ఇప్పటికే కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఒక్కరికైనా ఈసారి తప్పకుండా కేంద్ర మంత్రి పదవి వస్తుందని, తద్వారా జిల్లా అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని ఆశించారు. కానీ సోమవారం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ నేతృత్వంలోని మంత్రివర్గ జాబితాలో జిల్లా ఎంపీల పేర్లు కనుమరుగయ్యాయి.

రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన మల్లారెడ్డికి అనుభవం లేదన్న కారణంతో మంత్రి పదవి రాదేమోనని కొందరు భావించినా.. బీసీ వర్గాల్లో పట్టున్న నేత, రాజకీయ అనుభవజ్ఞుడైన దేవేందర్‌గౌడ్‌కైనా అవకాశం కల్పిస్తారని ఊహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ, బీజేపీలకు గణనీయ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం జిల్లా వాసులను సంతృప్తిపరుస్తుందని భావించారు. అటు టీడీపీ గానీ, బీజేపీ గానీ వారి ఆశలను అర్థం చేసుకోలేకపోయాయి.
 
 రెండు నుంచి జీరోకు
మునుపెన్నడూ లేని విధంగా యూపీఏ 2 ప్రభుత్వం మంత్రిపదవుల విషయంలో జిల్లాపై అమిత వాత్సల్యం కనబరిచింది. ఇరువురు జిల్లా ఎంపీలకు కేబినెట్‌లో స్థానం కల్పించి అభిమానం చాటింది. చేవెళ్ల నుంచి ఎంపికైన ఉన్నత సామాజిక వర్గ నేత జైపాల్‌రెడ్డికి, మల్కాజిగిరి నుంచి గెలిచిన దళిత నాయకుడు సర్వే సత్యనారాయణకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి అటు అగ్రవర్ణాలను, ఇటు వెనుకబడిన వర్గాలకు సంతృప్తి కలిగించింది.

జిల్లాకు రెండు మంత్రి పదవులు ఎలా ఇస్తారని అప్పట్లో కొందరు వ్యతిరేకించినా అత్యధిక పార్లమెంటు స్థానాలు అందించిన తెలంగాణకు, ముఖ్యం గా రెండు ఎంపీలను గెలిపించిన రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇరువురికీ మంత్రి పదవులిచ్చి ఆదరించింది. కొత్తగా ఏర్పడిన మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం జిల్లాను చిన్నచూపు చూడటంతో కేంద్రమంత్రి వర్గంలో జిల్లా ప్రాతినిధ్యం రెండు నుంచి జీరోకు పడిపోయింది. ఈ పరిణామం  బీజేపీ, టీడీపీ పార్టీల నేతలకే ఆగ్రహం కలిగిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement