సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగర రూపురేఖలు మారనున్నాయా..? తెలంగాణలోనే ఖమ్మం అభివృద్ధిలో అగ్రపథాన నిలువనుందా..? నగరం అన్ని హంగులూ సంతరించుకోనుందా..? ఇలాంటి ప్రశ్నలెన్నో ఖమ్మం వాసులను తొలిచివేస్తున్నాయి. స్మార్ట్ సిటీ ఆలోచన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నగరానికి ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం బుధవారం జిల్లాకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలి దశలో దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రూ. కోట్లతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, పారిశుధ్యం వ్యవస్థలను ఆధునికీకరించి ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఖమ్మం అర్బన్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విలీనం చేయడంతో 2012లో ఖమ్మం కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. మూడు లక్షల పై చిలుకు జనాభాతో 50 డివిజన్లు చేశారు. అయితే కార్పొరేషన్ హోదా లభించినా అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. అయినా ఖమ్మాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి అనుకూలంగా ఉన్న అంశాలపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఇక్కడకు పంపిస్తోంది. ఇందులో ఒకరు కన్సల్టెంట్ కాగా మరో ఇద్దరు సాంకేతిక నిపుణులు మహాలింగం, దినేష్‌లు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్మార్ట్ సిటీల జాబితాలో ఖమ్మం నగరాన్ని చేర్చాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందజేశారు.
బృందం అధ్యయనం చేయనున్న అంశాలు..
కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా ఈ బందం తొలుత సమావేశం కానుంది. నగరంలో డ్రైనేజీల వ్యవస్థ, నిర్వహణ, ఆన్‌లైన్ సేవలు, రోడ్లు, పారిశుధ్యం, మంచినీరు, తదితర అంశాలను ఈ బృందం సభ్యులు అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
ఆ తర్వాత నగరంలో ప్రజలకు అందజేస్తున్న సేవలను ప్రత్యేకంగా పరిశీలించనున్నారు.
అధికారులతో చర్చించిన సారాంశం, నగర సమస్యలు తదితర అంశాలన్నింటినీ నివేదికగా తయారు చేసి కేంద్రానికి ఈ బృందం అందజేయనుంది.
తిష్టవేసిన సమస్యలు ఇవే..
నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ తప్పనిసరి. దీనిపై గత ఐదేళ్లుగా అధికారులు ఎలాంటి కసరత్తు చేయలేదు.
భవన అనుమతులు, పంపు కనెక్షన్లు, ట్రేడ్ లెసైన్సులు ఆన్‌లైన్ ద్వారా జారీ చేయాల్సి ఉన్నా అది అమలుకావడం లేదు.
నగరంలో లక్ష కుటుంబాలు ఉన్నా కేవలం 24,500 ఇళ్లకే మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల వాసులకు మంచినీటి సమస్య తప్పడం లేదు. ప్రస్తుతం మంచినీటి సరఫరా రోజువిడిచి రోజు చేస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా కేవలం 115 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. నగరం కార్పొరేషన్ అయినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మాత్రం లేదు. చిన్నపాటి వర్షానికే మామిళ్లగూడెం, బస్టాండ్ సెంటర్, కస్పాబజార్, మార్కెట్ ప్రాంతం చెరువులను తలపిస్తున్నాయి.
నగర వ్యాప్తంగా ప్రస్తుతం 397 కి.మీ మేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. కానీ మురుగు నీరంతా నగరం నుంచి పంపించాలంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థే శరణ్యం. నగరంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. జనాభాకు తగిన విధంగా శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో ఏ వీధి చూసినా చెత్తమయంగా మారింది. కార్పొరేషన్ హోదాకు తగ్గట్లుగా శానిటేషన్ సిబ్బంది లేరు. ఒక కార్మికుడు ప్రతి రోజూ 2 కిలోమీటర్ల దూరం మురుగు కాల్వలు తీయడంతో పాటు రోడ్లను శుభ్రం చేయాలి. కానీ ఈ ప్రాతిపదికన కార్మికుల నియామకాలు లేవు.
నెరవేరనున్న నగర ప్రజల కల..
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘ఖమ్మం నగర ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని ప్రకటించినప్పటి నుంచి ఖమ్మం, కొత్తగూడెంలను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని పలుమార్లు పార్లమెంట్‌లో ప్రస్తావించా. అలాగే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రికి గతంలోనే వినతిపత్రం అందజేశా. ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ అధ్యయనంపై నగరానికి బృందాన్ని పంపిస్తోంది.
ఈ బృందం వెళ్లిన తర్వాత రెండు, మూడు రోజుల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోపాటు ప్రధానమంత్రిని కలిసి తొలి జాబితాలోనే ఖమ్మాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని కోరుతా. స్థానిక సమస్య లు, అభివృద్ధికి ఉపయోగ పడే సూచనలన్నింటినీ ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇస్తుంది. ఈ బృందం వీలైనంత త్వరగా అధ్యయనం చేసి ఈ నివేదికను కేంద్రానికి అందజేయాలి. ఖమ్మం స్మార్ట్ సిటీ అయితే నగరం రూపు రేఖలే మారుతాయి. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, పారిశుధ్య వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అన్ని రంగాల్లో జిల్లాకు మణిమాణిక్యంగా ఖమ్మం వెలుగొందుతుంది.’
స్మార్ట్ సిటీతో నగరం సుందరంగా మారనుంది..: పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కేంద్ర జాబితాలో ఖమ్మం నగరం స్మార్ట్ సిటీగా అవకాశం దక్కితే ఖమ్మం సుందర నగరంగా ఆవిర్భవిస్తుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్న సయమంలోనే నగరం స్మార్ట్ సిటీ అవనుండటం సంతోషకరం. కేంద్రం ఇచ్చే రూ.కోట్ల నిధులతో ఖమ్మం నగర ప్రజలు అన్ని సౌకర్యాలను పొందనున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ అభివృద్ధి చెందనున్నాయి. ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి విజ్ఞప్తులు అందజేశా.
స్మార్ట్ బృందం వస్తుందోచ్..
Published Wed, Oct 29 2014 4:06 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM
Advertisement