గజ్వేల్: యూరియా కోసం జిల్లాలో ఇప్పటినుంచే హైరానా నెలకొన్నది.. ప్రతి ఏటా భారీ క్యూలైన్లు.. చెప్పుల దారులు.. తిండితిప్పలు మాని పిల్లాపాపలతో కలిసి నిరీక్షణ.. ఒక్క బస్తా కోసం రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి. ఇవీ ప్రతి ఖరీఫ్‌లో యూరియా కోసం రైతన్న పడుతున్న పాట్లు.. విత్తనాల వేయడం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందేమోనన్న భయంతో ముందస్తుగా యూరియాను కొనుగోలు చేస్తున్నారు.. గజ్వేల్‌లో వ్యాపారి ఓ అడుగు ముందు కేసి యూరియా బస్తా ధర అదనంగా రూ.30 వసూలు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో 1.80లక్షల టన్నుల యూరియా, కాంప్లెక్స్, డీఏపీ ఎరువులు అవసరం. ఇందులో భాగంగానే యూరియా 87వేల టన్నుల అవసరమని భావిస్తుండగా ఇప్పటివరకు 31వేల టన్నుల యూరియా విడుదలైంది. మూడేళ్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికలోపం కారణంగా యూరియా కొరత ఏర్పడి ఒకటిరెండు సంచులకోసం రైతులు పోలీస్‌స్టేషన్ల వద్ద తిండి తిప్పలు మాని ఉదయ నుంచి రాత్రివరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది.
అయినా దొరక్క నిత్యం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో యూరియా వేయలేక భారీగా పంట నష్టానికి గురయ్యారు. ప్రస్తుతం గతం తాలూకు చేదు అనుభవాలు రైతులను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వారంతా ముందస్తు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. గజ్వేల్ పట్టణంలో నిత్యం యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువుల వందలాది క్వింటాళ్ల విక్రయాలు సాగుతున్నాయి. ఇక్కడికి స్థానిక రైతులే కాకుండా దౌల్తాబాద్, తొగుట, చేగుంట, వరంగల్ జిల్లా చేర్యాల, నల్గొండ జిల్లా రాజపేట మండలాలకు చెందిన రైతులు ఇక్కడ ఎరువుల కొనుగోలు చేస్తున్నారు.
రైతు ఫిర్యాదుతో వెలుగులోకి..
గజ్వేల్‌లో యూరియా బ్లాక్ మార్కెట్ అప్పుడే మొదలైంది. మంగళవారం ఓ రైతు ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లికి చెందిన రైతు నరేందర్‌రెడ్డికి పట్టణంలోని వెంకటరమణ ట్రేడర్స్‌కు చెందిన యజామాని యూరియా రూ.298కి విక్రయించాల్సిందిపోయి అదనంగా రూ.32 ఇస్తేనే యూరియా ఇస్తానని, అంతేకాకుండా 15 కాంప్లెక్స్ 20-20 ఎరువు కొనుగోలు చేస్తే 30 యూరియా బస్తాలు ఇస్తానని లింకు పెట్టాడు. దీంతో బాధిత రైతు ఫిర్యాదు చేయడంతో స్థానిక వ్యవసాయాధికారి ప్రవీణ్ దీనిపై విచారణ చేపట్టి సదరు దుకాణంలో అమ్మకాలను నిలిపివేయడమే కాకుండా నోటీసులు జారీ చేశారు.
బ్లాక్‌మార్కెట్‌ను సహించం..
యూరియా ఎంత అవసరముంటే అంత స్టాకు తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే మాత్రం సహించేది లేదు. కఠిన చర్యలు తప్పవు.
-హుక్యానాయక్, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్.
అదే హైరానా!
Published Thu, Jun 11 2015 12:15 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement